Share News

కోర్కె తిరస్కరించిందని పెట్రోలు పోసి నిప్పంటించాడు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:38 AM

‘రెండేళ్లుగా కలిసున్నాం.. రెండు నెలలుగా విడిపోయాం. ఈ ఒక్కసారి కలుసుకుని విడిపోదాం. ఇంకెప్పుడూ నీ జోలికిరాను!’ అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని కోరాడు.

కోర్కె తిరస్కరించిందని పెట్రోలు పోసి నిప్పంటించాడు

  • ఓ ప్రియుడి ఘాతుకం.. అదే సీసాలోని పెట్రోలుతో ప్రియుడిపై దాడి

  • నెల్లూరు జీజీహెచ్‌లో ఇద్దరికీ చికిత్స.. ఘటనలో ఆటో దగ్ధం

నెల్లూరు రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘రెండేళ్లుగా కలిసున్నాం.. రెండు నెలలుగా విడిపోయాం. ఈ ఒక్కసారి కలుసుకుని విడిపోదాం. ఇంకెప్పుడూ నీ జోలికిరాను!’ అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని కోరాడు. ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించాడు. చివరకు అదే పెట్రోల్‌ను ఆమె అతనిపైనా చల్లడంతో ఇద్దరూ గాయపడ్డారు. నెల్లూరు రూరల్‌ మండలం చింతారెడ్డిపాళెం పరిసరాల్లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ గుంజి వేణు కథనం మేరకు.. బుచ్చి మండలం మినగల్లుకు చెందిన ఓ మహిళ(38) భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. అదే మండలం పెద్దూరుకు చెందిన ఓ యువకుడితో(29) ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రెండు నెలల క్రితం వారి మధ్య విభేదాలు రావడంతో ఇక వారు కలవకూడదని పంచాయితీలో పెద్దలు తీర్మానం చేశారు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడాలంటూ తన ఆటోలో ఎక్కించుకుని చింతారెడ్డిపాళెం పరిసరాల్లోకి తీసుకువెళ్లాడు. ఆటోలోనే కొంతసేపు మాట్లాడుకున్నాక ఇద్దరం శారీరకంగా కలుద్దామని కోరాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి, నిప్పంటించాడు. ఆమె తిరగబడి సీసాలో మిగిలిన పెట్రోల్‌ను అతనిపై చల్లింది. ఇద్దరికీ నిప్పంటుకోవడంతో పక్కనే కాలువలోకి దూకేశారు. ఆ తర్వాత నెల్లూరులోని జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఆటోకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది.

Updated Date - Feb 24 , 2026 | 04:38 AM