హత్య చేసి కాశీలో పిండ ప్రదానం
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:58 AM
పదిహేనేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరియమైన మహిళను.. ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో గల రూ.ఐదు లక్షలు నగదు అపహరించుకుపోయాడు.
డబ్బు, బంగారం కోసమే చంపేశాడు
15 ఏళ్ల కిందట రాంగ్‌కాల్‌తో పరిచయం
మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
నిందితుడి అరెస్టు.. చోరీ సొత్తు రికవరీ
విశాఖపట్నం/ఆరిలోవ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): పదిహేనేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరియమైన మహిళను.. ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో గల రూ.ఐదు లక్షలు నగదు అపహరించుకుపోయాడు. కాశీ వెళ్లి అక్కడ ఆమె పేరిట పిండ ప్రదానం, అన్నదానం చేశాడు! విశాఖ ఆరిలోవ దుర్గానగర్‌లో ఈనెల 11న జరిగిన కాపు లక్ష్మి(48) హత్య కేసులో నిందితుడు వంజరాపు శివగంగరావు అలియాస్ టాటూ శివ(34) చెప్పిన వివరాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు. సోమవారం క్రైమ్ డీసీపీ లతామాధురి తెలిపిన మేరకు జీవీఎంసీలో ఉద్యోగం చేస్తున్న కాపు వెంకటరమణ దుర్గానగర్‌లో సొంతింట్లో భార్య లక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె, కుమారుడు వివాహాలై దూరంగా ఉంటున్నారు. ఈనెల 11న వెంకటరమణ విధులకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భార్య లక్ష్మి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ, ఘటనా స్థలంలో టవర్ డంప్ కాల్స్‌ను పరిశీలించగా ఒకరిపై అనుమానం కలిగింది. నిందితుడు విజయనగరం జిల్లా బొబ్బిలి కోనేరుగట్టు ప్రాంతానికి చెందిన వంజరాపు శివగంగరాజు అలియాస్ టాటూ శివగా గుర్తించారు. శివగంగరాజు హత్య చేసిన తర్వాత ధన్‌బాద్, కాశీ, ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఈనెల 22న రైలులో బొబ్బిలి వైపు వెళుతుండగా విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
పదిహేనేళ్ల కిందట కాపు లక్ష్మి రాంగ్ కాల్ ద్వారా పరిచయమైందని చెప్పాడు. అతడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి రూ.కోటి వరకు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం 25 లక్షలు అప్పులున్నాయి. వాటిని తీర్చేందుకు గతంలో ఫోన్ ద్వారా పరిచయమైన కాపు లక్ష్మిని ఉపయోగించుకోవాలని పథకం పన్నాడు. ఈనెల 11న ఆరిలోవ వెళ్లి వేరొకరి ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాడు. ఉదయం 10.12 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి లక్ష్మిని డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించింది. ఆమె నోరు, ముఖం గట్టిగా మూసేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, నల్లపూసలదండ, ఉంగరాలు, కప్‌బోర్డులో ఉంచిన రూ.ఐదు లక్షల నగదును తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాశీలో లక్ష్మికి పిండ ప్రదానం చేసి, అక్కడే అన్నదానం చేశానని పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలిసింది. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.