హనీమూన్‌లో నెలసరి.. మూడ్ చెడగొట్టావంటూ భార్యపై దాడి! 3 ఏళ్ల తరువాత..
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:37 PM
హనీమూన్‌లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: హనీమూన్‌లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది. యూపీలోని ఘోరఖ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. తనను అత్త, ఆడపడుచు కూడా మానసిక వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, గోరఖ్‌పూర్‌కు చెందిన ఆమెకు ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో 2023 మే 30న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తన తండ్రి రూ.20 లక్షల నగదు, ఒక కారు, రూ.40 లక్షల విలువైన రకరకాల బహుమతులను ఇచ్చారని ఆమె చెప్పింది. అత్తవారింటి కోరిక మేరకు తన తండ్రి తనకు బ్రాండెడ్ వస్తువులనే కొనిచ్చి సాగనంపారని పేర్కొంది.
జూన్ 2న తాను అత్తారింటికి వెళ్లిన తరువాత వేధింపులు మొదలయ్యాయని ఆమె చెప్పింది. తన తండ్రి ఇచ్చిన బహుమతులను ఎత్తిచూపుతూ అత్తింటి వారు తనను హేళన, అవమానాలకు గురి చేశారని ఆరోపించింది. ఆ తరువాత నెల రోజులకు తాము హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లామని చెప్పింది. అక్కడ తనకు నెలసరి రావడంతో తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. దీంతో, తన భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడని, తన మూడ్ చెడిపోయిందంటూ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
హనీమూన్ నుంచి తిరిగొచ్చాక జరిగిన విషయం గురించి అత్తా ఆడపడుచుకు చెప్పుకున్నా వారు కనికరం చూపకుండా తనను మానసికంగా వేధించారని చెప్పింది. తన తండ్రిని ఢిల్లీకి రమ్మని పిలిచి నీ కూతురితో కలిసుండేది లేదని తెగేసి భర్త చెప్పాడని ఆరోపించింది. అత్తింటి వారు కూడా తన తండ్రిని అవమానించారని పేర్కొంది. వారికి నచ్చ చెప్పేందుకు తన తండ్రి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని పేర్కొంది. భర్తపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు స్వీకరించలేదని పేర్కొంది. చివరకు గోరఖ్‌పూర్ ఎస్ఎస్‌పీ జోక్యం చేసుకోవడంతో ఆగస్టు 15న ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించింది. కట్నంగా తీసుకున్న వస్తువులు ఏవీ వారు ఇంతవరకూ తమకు తిరిగివ్వలేదని ఆరోపించింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి
భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..