Share News

ఎన్‌కౌంటర్‌లో తనయుడి మృతి.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన తండ్రి

ABN , Publish Date - Feb 07 , 2026 | 09:32 PM

ఎన్‌కౌంటర్‌లో తన కొడుకును పోలీసులు మట్టుబెట్టడం సబబేనని ఓ తండ్రి వ్యాఖ్యానించారు. తాను పోలీసులకు 100 శాతం మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్‌కౌంటర్‌లో తనయుడి మృతి.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన తండ్రి
Bihar Vaishali District Shocker

ఇంటర్నెట్ డెస్క్: ఎన్‌కౌంటర్‌లో తన కొడుకును మట్టుపెట్టిన పోలీసులకు ఓ వృద్ధుడు ధన్యవాదాలు తెలిపారు. తన మద్దతు పోలీసులకే అని కూడా తేల్చి చెప్పారు. బిహార్‌లోని వైశాలి జిల్లాలో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది.

నందకిశోర్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడి కుమారుడు ప్రిన్స్ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అంతర్ రాష్ట్ర క్రిమినల్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్న ప్రిన్స్‌పై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ గ్యాంగ్ 6 రాష్ట్రాల్లో పలు జువెలరీ షాపులు, బ్యాంకుల్లో భారీ స్థాయిలో నగలను చోరీ చేసింది. దాదాపు 300 కేజీల బంగారు నగలను లూటీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని 56 కేజీల బంగారు నగల చోరీ కేసు, బిహార్‌లో 55 కేజీల నగల చోరీ కేసు, రాజస్థాన్‌లో 24 కేజీల నగల చోరీ కేసుల్లో ప్రిన్స్ నిందితుడిగా ఉన్నాడు.


ప్రిన్స్ కోసం గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు పలుమార్లు అతడి తండ్రి నంద కిశోర్ సింగ్ ఇంటికి వచ్చి వెళ్లేవారు. దీంతో, విసిగిపోయిన నంద కిశోర్ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించి తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని కూడా అర్థించారు. చివరకు ప్రిన్స్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

‘పోలీసులు 100 శాతం మంచి పని చేశారు. నా బిడ్డ ఒక క్రిమినల్. అతడిని మార్చేందుకు నేను చాలా ప్రయత్నించాను. అతడి నేర కార్యకలాపాలతో మా కుటుంబం విసిగిపోయింది. అతడిని ఎన్‌కౌంటర్‌ చేయమని నేను పోలీసులను ఒకసారి కోరాను. అతడి నేరాల వల్ల కుటుంబం పరువు మంటగలిసింది. అందరూ మమ్మల్ని అవమానకరంగా చూస్తున్నారు. చదువుకునే రోజుల్లో ప్రిన్స్ నేరాల బాటపట్టాడు. చెడు సావాసాల వల్లే అతడికి ఈ దుర్గతి పట్టింది’ అని నంద కిశోర్ సింగ్ తెలిపారు.


ఈ వార్తలూ చదవండి:

ఆప్ నేత హత్య.. మాస్క్ పెట్టుకుని తుపాకీతో వచ్చిన షూటర్..

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ

Updated Date - Feb 07 , 2026 | 09:42 PM