దొంగ ‘పెళ్లి కొడుకు’
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:19 AM
ఒంటరి మహిళలే లక్ష్యంగా వల వేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి, ఘోరంగా వంచించి...బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు.
పెళ్లి పేరిట దగ్గరై.. నిలువునా దోచేసి..
గతంలో జర్నలిస్టుగా పనిచేసిన గుంటూరు వాసి
ఏకంగా మీడియా సీఈవోగా నకిలీ అవతారం
మ్యాట్రిమోనిలో ఫేక్ వివరాలు.పక్కాగా గేలం
మాయమాటలతో బంగారం, డబ్బు స్వాహా
వల పన్ని పట్టుకున్న ఏలూరు పోలీసులు
ఏలూరు క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఒంటరి మహిళలే లక్ష్యంగా వల వేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి, ఘోరంగా వంచించి...బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు. ఏలూరు జిల్లా జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు తెలిపారు. ఆ వివరాలివీ.. గుంటూరుకు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) గతంలో సాక్షి పత్రికలో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాతి కాలంలో ఆ పత్రిక, టీవీలకు సీఈవోనంటూ గూగుల్ వెబ్‌సైట్‌లో ఫేక్ వివరాలు అప్‌లోడ్ చేసుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో ఒంటరి మహిళలను, విడాకులు పొందిన వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. తొలి పరిచయం అంటూ మహిళలను ఖరీదైన హోటళ్లకు ఆహ్వానించి...వారితో మాటలు కలిపి దగ్గరవుతాడు. మేడం అంటూ తొలుత అతి గౌరవం ఇచ్చి.. చనువు పెరిగాక ముద్దు పేర్లతో పిలుస్తూ.. మరింత దగ్గరవుతాడు. పరిచయం అయిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకుంటానంటూ హడావుడి చేస్తాడు. పెళ్లికి రెడీ అంటూ.. ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న బాసికాలు, పెళ్లి దుస్తులను చూపిస్తాడు. వలలో పూర్తిగా పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత.. క్రమంగా తన ప్లాన్‌ను అమలు చేస్తాడు. కొంత శిక్షణ పొందితే, తనకు ఉన్నత ఉద్యోగం వస్తుందని, దానికి కొంత సొమ్ము అవసరమని నమ్మిస్తాడు. అతడి మాటలు నమ్మి బాధితుల్లో కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వగా, మరికొందరు ఒంటి మీది బంగారం తీసి ఇచ్చారు.
ఆపై చిన్నపాటి గొడవపడి వారితో మాట్లాడిన సిమ్‌ను అతడు తీసేసేవాడు. ఈ విధంగా ఏకంగా 38 సిమ్‌లను మార్చాడు. వారి పేరుమీదే క్రెడిట్ కార్డులు తీసుకుని అప్పులు చేసేవాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చెన్నైలోను ఈ విధంగా పలువురి మహిళలను మోసగించాడు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళను ఇదేరీతిలో నమ్మించాడు. డబ్బులు కావాలని ఆమెను అడిగాడు. అతనిపై అనుమానం రావడంతో ఆమె స్థానిక పోలీసులకు నెల రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు. సాంబశివరావు ఆట కట్టించడానికి ఎస్పీ కిశోర్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బుల కోసం ఆ మహిళ వద్దకు గురువారం సాంబశివరావు రాగా, పొలీసులు వల పన్ని పట్టుకున్నారు. మహిళల నుంచి అతడు తీసుకున్న ఎనిమిది కాసుల బంగారు ఆభరణాలు, ఆరు సెల్‌ఫోన్లు, పది సిమ్ కార్డులు, 10 బ్యాంక్ పుస్తకాలు, 9 ఏటీఎం కార్డులు, అతడు ధరించే రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, కారు, నల్లకోటును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కిశోర్ చెప్పారు. మ్యాట్రిమోని వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఏ సంబంధమైనా స్వయంగా వెళ్లి పరిశీలించుకోవాలన్నారు. పోలీస్ వెరిఫికేషన్ కోసం రూ.500 చెల్లిస్తే, ఆ వ్యక్తిపై కేసులు ఉన్నాయా లేదా, ఉద్యోగం నిజమైందా కాదా అనేది పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్పీ తెలిపారు.