బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:18 AM
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఇంటికే కన్నం వే సిందో మహిళ.....
నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి భారీ చోరీ
రూ.50 లక్షల విలువైన నగలతో పరారైన మహిళ
కూకట్‌పలి/హైదరాబాద్ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఇంటికే కన్నం వే సిందో మహిళ.! ఇంట్లోని బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి భారీ చోరీకి తెగబడింది. ఆశ్రయం ఇచ్చిన వారికి నిమ్మరసంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి ఉడాయించింది. బాఽధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హిమబిందు దంపతులు బాలానగర్ పరిధిలోని ఆదర్శ నగర్‌లో నివాసముంటున్నారు. హిమబిందు భర్త పూజారిగా చేస్తున్నారు. హిమబిందుకు దూరపు బంధువైన గుంటూరుకు చెందిన చెరుకుపల్లి లక్ష్మీసర్వాని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో హిమబిందు ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి పనిలో పెట్టుకుంది. ఆర్నెల్లుగా వారి ఇంట్లో నమ్మకంగా నటించిన లక్ష్మీ.. హిమబిందు బంగారు అభరణలపై కన్నేసింది. వేసవిలో ఉపశమనం కలుగుతుందని నమ్మించి ఈనెల 13న రాత్రి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి హిమబిందు, ఆమెభర్తకు ఇచ్చింది. వారు మత్తులోకి జారుకున్న తర్వాత తన అనుచరులు పర్వతం కిరణ్‌కుమార్ (30), కొనపర్తి యశ్వంత్ (19), దిలిప్ (23), శివల సహాయంతో ఇంట్లోని 30 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు దొంగిలించి పరారైంది. మత్తు నుంచి తేరుకున్న బాధితులు.. లక్ష్మి ప్లాన్ ప్రకారమే చోరీకి పాల్పడిందని గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బాలానగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీసర్వానితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు ఏసీపీ నరేశ్‌రెడ్డి తెలిపారు.