Share News

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:42 AM

మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్‌ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్‌ మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్‌ హత్య చేయించింది.

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

  • రాజస్థాన్‌లో దారుణ ఘటన

శ్రీగంగానగర్‌, ఫిబ్రవరి 5 : మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్‌ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్‌ మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్‌ హత్య చేయించింది. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ హత్యోదంతాన్ని మరువకముందే అదే తరహా ఘటనఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వాకింగ్‌ అని భర్తను బయటకు తీసుకెళ్లిన భార్య.. తన ప్రియుడితో అతడిని చంపించేసింది. ఆపై, గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందంటూ నాటకమాడింది. కానీ పోలీసు విచారణలో ఆమె ఘాతుకం బయటపడింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌, అంజు(23)కు మూడు నెలల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్ధల వల్ల అంజు వెంటనే పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి అత్తింటికి వచ్చింది. అయితే, జనవరి 30వ తేదీ రాత్రి 9 గంటలకు ఆశిష్‌, అంజు రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ఆశిష్‌ మరణించాడు. తర్వాత పోలీసులు అంజును విచారించారు. భర్తతో కలిసి తాను ఈవినింగ్‌ వాక్‌కు వెళ్లగా.. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టి వెళ్లిందని చెప్పింది. అలాగే, కారులోని దుండగులు తన బంగారు ఆభరణాలను కూడా దొంగలించారంది. అంజు చెప్పిన సమాచారానికి, ఘటనాస్థలంలో పరిస్థితికి పొంతన లేకపోగా.. ఆశిష్‌ శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అంజును గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టింది. తమ ఇంటికి సమీపంలో ఉండే సంజు అనే వ్యక్తితో అంజుకు పెళ్లికి ముందు నుంచే సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అంజు అతడితో నిత్యం మాట్లాడేది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లి ఉన్నప్పుడు సంజును కలిసిన అంజు తన భర్త ఆశిష్‌ హత్యకు కుట్ర చేసింది. దీంతో పథకం ఆశి్‌షను వాకింగ్‌ పేరుతో ఓ నిర్మానుష్య రహదారిలోకి తీసుకెళ్లింది. అప్పటికే తన స్నేహితులు రాకీ, సిద్ధార్థ్‌తో కలిసి ఆ మార్గంలో మాటు వేసిన సంజు.. ఆశి్‌షపై దాడి చేసి గొంతు నులిమి ప్రాణం తీశారు. కేసులో నిందితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Feb 06 , 2026 | 02:42 AM