రూ.3.2 కోట్ల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:23 AM
కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
కూరగాయల మాటున గుట్టుగా రవాణా
647 కేజీలు స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ
అదుపులో వాహన డ్రైవర్
ఆరు పోలీసు స్టేషన్లు దాటి రావడంపై అనుమానాలు
బొండపల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. అందులో ఉన్న 647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం సిమిలిగూడ ప్రాంతం నుంచి వస్తున్న వాహనం(వ్యాను) అనుమానాస్పదంగా కనిపించడంతో విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసుస్టేషన్ వద్ద ఎన్‌సీబీ అధికారులు ఆపి తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయింది. స్మగ్లర్లు వాహనం నుంచి గంజాయి వాసన బయటికి రాకుండా పేపరు కవర్లలో ప్యాక్ చేసి ప్లాస్టిక్ టేపుతో సీల్ చేశారు. ఒకవేళ పోలీసులు తనిఖీలు చేసినా దొరక్కూడదనే ఉద్దేశంతో వ్యాను అడుగున గంజాయి ప్యాకెట్లు వేసి, దాని పైన క్యాబేజీ బుట్టలు, అల్లం, వెల్లుల్లి సంచులు పేర్చారు. మొత్తం 123 ప్యాకెట్లలో ఉన్న 647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, దీని విలువ రూ.3.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఏపీలో ఆరు పోలీసు స్టేషన్లను దాటుకుని..
కాగా.. ఒడిశా రాష్ట్రం నుంచి ఏపీలో ప్రవేశించిన ఈ వ్యాను పాచిపెంట, సాలూరు, రామభద్రపురం, బూర్జవలస, మానాపురం, గజపతినగరం పోలీసుస్టేషన్లు దాటుకుని వచ్చి బొండపల్లి పోలీసుస్టేషన్ వద్ద నార్కోటెక్ అధికారులకు పట్టుబడింది. ఆ పోలీసుస్టేషన్ల మీదుగా ఈ వాహనం వచ్చినా అక్కడి పోలీసులు గుర్తించలేక పోవడంపై అనుమానం వ్యక్తమవుతోంది. గంజాయి వాహన డ్రైవరును ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నార పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.