ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:10 AM
బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరుగెత్తుకొనొచ్చి.. ఒడిలోకి తీసుకొని లాలించాల్సిన కన్నతల్లే అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో రెండు నెలల బిడ్డను కాళ్లు....
చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి నిప్పుల పొయ్యిలో పడేసిన వైనం
2నెలల శిశువు సజీవహదనం .. బౌరంపేట్‌లో ఘోరం
దుండిగల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరుగెత్తుకొనొచ్చి.. ఒడిలోకి తీసుకొని లాలించాల్సిన కన్నతల్లే అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో రెండు నెలల బిడ్డను కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. మంటల్లో పడేసింది. తల్లి కోపానికి ఆ బిడ్డడు సజీవదహనమైపోయాడు. దుండిగల్ పరిధిలోని బౌరంపేట్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బీన స్టేషన్‌సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందిన చె ందిన రాజేంద్ర ఆదివాసీ, మమత దంపతులు నెలక్రితం తమ రెండు నెలల కుమారుడు సూర్యతో కలిసి బౌరంపేట్ ప్రాంతానికి వలసవచ్చారు. బౌరంపేట్ ఓఆర్‌ఆర్ రింగ్‌రోడ్డును అనుకొని నిర్మాణంలో ఉన్న సానరెల్లి హైరైజ్ అపార్ట్‌మెంట్స్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్డులోనే వారు ఉంటున్నారు. కొన్ని రోజులుగా బిడ్డ అదేపనిగా ఏడుస్తుండటంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండే షెడ్డు చుట్టూ ఎవరూ లేని సమయంలో చిన్నారి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసింది. బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత ఇంట్లో మండుతున్న పొయ్యిలో ఆ బిడ్డను విసిరేసింది. తెల్లవారుజామునే పనికి వెళ్లిన రాజేంద్ర ఉదయం 11 గంటలకు ఇంటికొచ్చేసరికి కుమారుడు పొయ్యిలో కాలుతూ కనిపించాడు. చిన్నారిని బయటకు తీసేసరికి అప్పటికే మృతిచెందాడు. దీనిపై మమతను రాజేంద్ర నిలదీయగా.. అదేపనిగా ఏడుస్తుండటాన్ని భరించలేకే బిడ్డను పొయ్యిలో వేసినట్లు చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తల్లి మమత మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కుమారుడిని చంపడం వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.