కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:50 AM
వివాహేతర సంబంధం అంటగట్టి భర్త చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. నా పిల్లలను నాతోనే తీసుకెళ్లిపోతున్నా క్షమించు డాడీ..
భర్త వివాహేతర సంబంధం అంటగట్టాడని మనస్తాపం
యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో ఘటన
బీబీనగర్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం అంటగట్టి భర్త చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. నా పిల్లలను నాతోనే తీసుకెళ్లిపోతున్నా క్షమించు డాడీ.. అంటూ తన తండ్రికి ఓ లేఖ రాసి పెట్టి.. రెండేళ్ల వయస్సున్న తన కూతురిని, 10 నెలల కొడుకుని చంపుకున్న ఆ తల్లి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. తన మీద అంత అనుమానం ఉంటే కొడుకు డీఎన్‌ఏని పరీక్షించుకోవాలని ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో భర్తను సవాలు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనలో ఏర్పుల ఐశ్వర్య(25) ఆమె కుమార్తె ఝాన్సీ(2), కొడుకు పండు(10 నెలలు) మరణించారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వలిగొండ మండలం వేములకొండకు ఏర్పుల ఐశ్వర్య(25)కు బీబీనగర్ మండలం గొల్లగూడెంకు చెందిన రైల్వే ఉద్యోగి మేకల మహేశ్‌కు 2020లో వివాహమైంది. మూడేళ్లకు వీళ్లకు పాప జన్మించింది. తర్వాత దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తంచేస్తూ వివాహేతర సంబంధం ఆరోపణలు చేసుకోగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వచ్చేటప్పటికే గర్భిణి అయిన ఐశ్వర్య కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు పండు వయస్సు ప్రస్తుతం 10 నెలలు కాగా కొడుకును చూసేందుకు మహేష్ రావడం లేదు. పైగా, ఐశ్వర్యకు రోజు మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో మహేష్ తనని తిరిగి కాపురానికి రమ్మంటున్నాడని ఐశ్వర్య తల్లిదండ్రులకు చెప్పింది. మహేష్ తన అత్తమామలపై(ఐశ్వర్య తల్లిదండ్రులు) కోపంగా ఉన్నాడని తెలిసి.. ఆమె పెద్దనాన్న, వేములకొండ గ్రామ సర్పంచ్ ఏర్పుల వెంకటేష్, శ్యామలమ్మ దంపతులు ఐశ్వర్య సోమవారం గొల్లగూడెంలోని అత్తగారింట్లో దిగబెట్టారు. విషయాన్ని మహేష్ తెలియజేసిన వారు ఐశ్వర్య, పిల్లలను భద్రంగా చూసుకోవాలని మహేష్ తల్లిదండ్రులు నర్సింహ, సత్తమ్మకు చెప్పి వెళ్లారు.
తెల్లవారేసరికి విగతజీవులై..
సోమవారం రాత్రి మహేష్ తల్లి సత్తమ్మ ఓ గదిలో.. ఐశ్వర్య, తన పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. మంగళవారం ఉదయం సత్తమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఆలస్యమైందని ఐశ్వర్య ఉన్న గది తలుపు తీసి చూసింది. పిల్లలిద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉండగా ఐశ్వర్య స్లాబ్ ఇనుప కొట్టానికి వేలాడుతూ కనిపించింది. దీంతో సత్తమ్మ ఇరుగుపొరుగును పిలిచింది. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లలను చంపిన తర్వాత ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక, ఐశ్వర్య వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడలు ఆత్మహత్య ఘటన అనంతరం అత్తామామలు ఇంటి నుంచి వెళ్లిపోయారు. భర్త మహే్‌షను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రేగు చెట్టు కింద బొంద పెట్టు డాడీ..
ఐశ్వర్య తమను స్వగ్రామం వేములకొండలోని తమ బావి వద్ద రేగు చెట్టు కింద బొందపెట్టు డాడీ అంటూ సూసైడ్ నోట్‌లో తన తండ్రిని వేడుకుంది. వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేసిన మహేశ్‌తో పాటు అత్తమామ, ఆడ బిడ్డలే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొంది. ‘నా పిల్లల మీద ప్రమాణం, నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం నేను ఏ తప్పూ చేయలేదు. నాపై అనుమానం ఉంటే నా కుమారుడి డీఎన్‌ఏ తన డీఎన్‌ఎతో పరీక్ష చేసుకుని చూడాలి’ అని భర్త మహేశ్‌కు సవాలు చేసింది. ‘అక్రమ సంబంధం అంటగట్టి రోజూ టార్చర్ పెడుతుండు డాడీ... నాలో ఓపిక నశించింది. నా పిల్లలను నాతోనే తీసుకుపోతున్నా. క్షమించు డాడీ.. అమ్మా..’ అంటూ ఐశ్వర్య మానసిక క్షోభతో రాసుకున్న నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో వివరాలు తెలిపింది.