గొంతు నులిమి.. ఇసుక దిబ్బల్లో పూడ్చి..
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:22 AM
రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి తన రెండున్నరేళ్ల కన్న కూతురినే కడతేర్చింది.
రెండో పెళ్లి చేసుకున్నాక.. కన్నబిడ్డనే కడతేర్చిన తల్లి
అమ్మమ్మ ఫిర్యాదుతో తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన దారుణం
భార్యాభర్తల అరెస్టు.. మరొకరి కోసం గాలింపు
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి తన రెండున్నరేళ్ల కన్న కూతురినే కడతేర్చింది. తిరుపతి ఈస్ట్ పోలీసుల కథనం ప్రకారం... తిరుపతికి చెందిన ఎర్రమల్లి ఆశాలత (19) భర్త రాజేశ్‌తో విభేదాల కారణంగా విడిపోయింది. అప్పటి నుంచి తన రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి పోస్టల్ కాలనీలో నివసిస్తోంది. ఏడాది క్రితం ఏర్పేడు మండలం చెన్నంపల్లెకు చెందిన ఇర్లా రెడ్డికుమార్ ఆమెకు ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. వీరిద్దరూ ఏడు నెలలక్రితం పెళ్లి చేసుకున్నారు. ఆశాలతకు ఇదివరకే పెళ్లై కుమార్తె ఉండడంతో రెడ్డికుమార్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దుర్గను అడ్డు తొలగించమని ఆశాలతకు పదేపదే రెడ్డికుమార్ చెప్తుండేవాడు. ఈనేపథ్యంలో ఈనెల 19న పాప తలపై ఆశాలత కర్రతో మోది, గొంతు నులిమి చంపేసింది. ఆశాలత, రెడ్డికుమార్, ఆయన స్నేహితుడు రాము కలిసి ద్విచక్రవాహనంపై చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లి ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నదీతరంలో ఇసుకలో పూడ్చిపెట్టి వచ్చారు. ఆశాలత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశాలతను, రెడ్డికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోదంతం వెలుగు చూసింది. ఏర్పేడు తహశీల్దార్ భార్గవి సమక్షంలో ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు బుధవారం చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితులు రెడ్డికుమార్, ఆశాలతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాము కోసం గాలిస్తున్నారు.