కన్న పిల్లలను పెంచలేక హత్య చేసిన తండ్రి
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:11 AM
పెంచి పోషించలేక ఓ కసాయి తండ్రి తన ముగ్గురు కూతుర్లను హత్య చేసి చెరువులో పడేశాడు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....
ముగ్గురినీ చెరువులో పడేసి అదృశ్యమయ్యారని ఫిర్యాదు
సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడిని రిమాండ్‌కు తరలింపు.. కామారెడ్డిలో ఘటన
కామారెడ్డి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పెంచి పోషించలేక ఓ కసాయి తండ్రి తన ముగ్గురు కూతుర్లను హత్య చేసి చెరువులో పడేశాడు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆదివారం వివరాలను వెల్లడించారు. కామారెడ్డిలోని ఆర్.బి.నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్, షబానా దంపతులకు సిఫాతు (8), ఆయాతు (7), మరియం (5) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన ముగ్గురు కూతుర్లను ఆటోలో బయటకు తీసుకెళ్లి హత్య చేసి చెరువులో తోసేశాడు. పిల్లలు సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో తల్లి షబానా ఇస్మాయిల్‌కు ఫోన్ చేసి విషయం తెలుపగా తినుబండరాలు కొనిచ్చి ఇంటి సమీపంలో వదిలేశానని సమాధానం ఇచ్చాడు. తర్వాత వారిద్దరూ కలిసి పిల్లల కోసం వెతికారు. ఎంతకీ దొరకకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ పుటేజీలను పరిశీలించి ఇస్మాయిల్ పిల్లలను ఆటోలో పెద్ద చెరువు వైపు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా పిల్లలను హత్య చేసి చెరువులో తోసేసినట్లు ఒప్పుకొన్నాడు. పోలీసులు అదే రోజు రాత్రి గజ ఈతగాళ్లతో మృతదేహాల కోసం గాలించారు. మొదట మరియం, ఆయాతు మృతదేహాలు, అర్ధరాత్రి పెద్ద కూతురు సిఫాతు మృతదేహం లభించాయి. ఆడ పిల్లలను పోషించలేక, అప్పులు ఎక్కువై, ఆర్థిక కారణాలతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని ఏఎస్పీ తెలిపారు. ఇస్మాయిల్‌ను రిమాండ్‌కు తరలించారు.