ఇంటర్ విద్యార్థి కీచక పర్వం
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:28 AM
ఓ ఇంటర్ విద్యార్థి తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించి.....
ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం.. ఫోన్‌లో చిత్రీకరణ
డబ్బు ఇవ్వకపోతే ఆ దృశ్యాలు బయటపెడతానని బెదిరింపులు
ఓ బాలికకు గర్భం.. ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్
నిందితుడిపై కేసు నమోదు.. జువెనైల్ హోంకు తరలింపు
ఇద్దరు వైద్యులు, ఓ నర్సు రిమాండ్.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన
నాగర్‌కర్నూల్/కొల్లాపూర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఓ ఇంటర్ విద్యార్థి తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించి.. వాటి ఆధారంగా వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధిత బాలికల్లో ఒకరు గర్భం దాల్చగా, ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడు కొల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి ,చెందిన విద్యార్థి. అతడు నాగర్‌కర్నూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తికి చెందిన ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. తనకు డబ్బు ఇవ్వాలని లేదంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, వారి తల్లిదండ్రులకు కూడా పంపిస్తాన ని బాధితులను బెదిరించాడు. ఆ విద్యార్థి ఆగడాలను భరించలేక బాధితుల్లో ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులు, బంధువులకు చెప్పుకొని ఏడ్చింది. బాధితురాలి తరఫువారంతా కలిసి ఆ బాలుడిని కొట్టి.. అతడి నుంచి ఫోన్ లాకున్నారు. అనంతరం అతడిని, ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గర్భం దాల్చిన బాలికను తాను కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు ఆ బాలుడు విచారణలో ఒప్పుకొన్నాడు. పోలీసులు బుధవారం కొల్లాపూర్‌లో సంబంధిత ఆస్పత్రికి వెళ్లి.. రికార్డులన్నింటినీ పరిశీలించి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. గురువారం ఆస్పత్రిలోని ఇద్దరు డాక్టర్లు, ఓ నర్సును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై పోలీసులు కేసు నమోదుచేసి జువెనైల్ హోంకు తరలించారు.