కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం కేసులో..ఓ నిందితుడి రిమాండ్.. మరొకరి కోసం గాలింపు
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:52 AM
బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం, వేధింపులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఆశిష్ అనే అతన్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు..?
నిజాంపేట్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం, వేధింపులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఆశిష్ అనే అతన్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్ అనే మరో నిందితుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు సీఐ సతీ్‌షకుమార్ తెలిపారు. అరెస్టయిన నిందితున్ని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని అదే కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఆశిష్ 2024లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం చేసుకున్నాడు. అప్పటినుంచి ఆశిష్.. బాధితురాలితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. పక్కా ప్లాన్ ప్రకారమే చాక్లెట్లలో గంజాయితో పాటు గర్భనిరోధక మాత్రలను కలిపి ఆమెకు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఓయోలు, లాడ్జిలు, హోటళ్లకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో ఆశిష్ తాను తీసిన వీడియోలను తన స్నేహితుడైన ప్రవీణ్‌కు చూపించాడు. అప్పటినుంచి అతను కూడా ఆ విద్యార్థినిని వీడియోలు చూపి బెదిరించేవాడు. ఓ పరీక్షకు సంబంఽధించిన బాధితురాలి హాల్ టికెట్‌ను ప్రవీణ్ తస్కరించాడు. గండిమైసమ్మలోని ఓ లాడ్జిలో ఉన్నానని, అక్కడికి వస్తేనే ఇస్తానని ఆమెను పిలిపించుకుని అత్యాచారం చేశాడు. కొన్నిసార్లు కడప జిల్లాలలోని ఓ ప్రాంతానికి బాధితురాలిని తీసుకెళ్లి నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి బాధితురాలు కళాశాలలో ఫిర్యాదు చేసినా.. హెచ్‌ఓడీ విభాగం పెద్దగా పట్టించుకోలేదు. ఈ కారణంగానే నిందితులు రెచ్చిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. కళాశాల యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది.