అంబర్‌పేటలో విషాదం
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:01 AM
హోటల్ వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల బాధ తాళలేక భార్యను హతమార్చిన భర్త, ఆపై కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పులబాధకు కుటుంబం బలి.. నిద్రిస్తున్న భార్యను చంపి.. తండ్రీకొడుకుల బలవన్మరణం!
హోటల్ వ్యాపారంలో నష్టాలే కారణం
అంబర్‌పేట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): హోటల్ వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల బాధ తాళలేక భార్యను హతమార్చిన భర్త, ఆపై కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ అంబర్‌పేటలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాపునగర్‌లోని కాకతీయలైన్‌లో నివాసముంటున్న ఖడ్గేకర్ రామరాజు(54)కు.. భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ రాజ్ (26), కుమార్తె ఉన్నారు. కూతురికి గతంలోనే వివాహం జరగగా, రామరాజు కుమారుడితో కలిసి నాచారం, రామంతాపూర్‌లో హోటల్, రెస్టారెంట్ల వ్యాపారాలు నిర్వహించేవారు. అయితే గత రెండేళ్లుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో నాచారంలో ఉన్న హోటల్‌ను మూసివేయాల్సి వచ్చింది. రామంతపూర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నడిపిన ల్యాండ్‌మార్క్ హోటల్ సైతం నష్టాలబాట పట్టడంతో, దానిని ఇతరులకు అప్పగించి వ్యాపారం నుంచి బయటకు వచ్చారు. వ్యాపారం కోసం చేసిన అప్పులు సుమారు రూ.కోటి న్నర వరకు చేరడంతో కుటుంబం మొత్తం మానసిక వేదనకు గురైంది. వారు నివసిస్తున్న ఇంట్లో కింది అంతస్తులో ఉంటోన్న సోదరుడు రవిరాజ్ కుటుంబంతో రామరాజు కుటుంబం సరదాగానే గడిపినట్లు.. కుటుంబ సభ్యులతో తమ ఆందోళనను బయట పడనీయలేదని తెలిసింది. పైఅంతస్తుకు వెళ్లిన తర్వాత వీరు తమ అప్పులపై తర్జనభ ర్జనకు గురై అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మాధవి మృతిపై అనుమానాలు
రామరాజు భార్య మృతదేహం ఉరివేసుకున్న స్థితిలో కాకుండా.. బెడ్‌పై పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో గడిపిన మాధవి, తర్వాత తాము ఉంటున్న ఇంట్లోకి పడుకోవడానికి వెళ్లింది. ఆమె నిద్రపోయిన తర్వాత రామరాజు, కుమారుడు శశాంక్ రాజ్ కలిసి మాధవిని దిండుతో అదిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం రామరాజు ఓ గదిలో.. తండ్రికి సహకరించిన కొడుకు మరో గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాము ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌నోట్ రాయడంతో పాటు మరణానికి ముందు తన స్నేహితుడికి వాట్సా్‌పలో చనిపోతున్నామంటూ మెసేజ్ పెట్టినట్లు తెలిసింది. అయితే స్నేహితుడు అక్కడకు చేరుకునేసరికే ఆ ముగ్గురు విగతజీవులుగా పడిఉన్నారు. రామరాజు కుమార్తె ఆమూల్య ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు 2009లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జగదీష్ సోదరుడు కావడం గమనార్హం.