3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:07 PM
మూడు రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం తలెత్తడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల నాటి సాంబార్ విషయంలో తలెత్తిన వివాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదానికి దారి తీసింది. సాంబార్ విషయంలో భర్తతో గొడవ అనంతరం ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కావ్య అనే మహిళకు రంగస్వామితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. గురువారం కావ్య తన భర్తకు మూడు రోజుల నాటి సాంబార్‌ను మళ్లీ వేడి చేసి వడ్డించింది. ఇది వారి మధ్య వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో రంగస్వామి ఆమెపై నోరు పారేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. మనస్తాపానికి లోనైన కావ్య ఇంట్లోని పురుగుల మందును తాగింది.
ఆ తరువాత కావ్య తీవ్ర అనారోగ్యానికి గురవడాన్ని గమనించిన ఇతర కుటుంబ సభ్యులు ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. పోలీసులు కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇక నగరంలో వెలుగు చూసిన మరో ఘటనలో కొందరు అపార్ట్‌మెంట్ వాసుల మధ్య వివాదం పోలీసు కేసుల వరకూ వెళ్లింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించిన వాకింగ్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకొచ్చారు. అది అక్కడే మూత్ర విసర్జన చేయడంతో పలువురు సీనియర్ సిటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా మొదలైన వివాదం చివరకు ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకూ వెళ్లింది. దీంతో, ఇరు వర్గాలు పరస్పరం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసుకున్నాయి.
ఈ వార్తలూ చదవండి
కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి
ముగ్గు వేస్తుండగా చైన్ స్నాచింగ్