అదానీని దాటేసిన జాంగ్ యిమింగ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:08 AM
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ అవతరించారు. భారత కుబేరుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని...
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ వ్యవస్థాపకుడు
న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ అవతరించారు. భారత కుబేరుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆయన తొలిసారిగా ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 43 ఏళ్ల జాంగ్ సంపద 10,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.10లక్షల కోట్లు)పైగా ఉంది. ఈయన తర్వాతి స్థానంలో అదానీ (10,480 కోట్ల డాలర్లు)ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 8,130 కోట్ల డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో శరవేగంగా విస్తరించడం జాంగ్ సంపద వృద్ధికి దోహదపడినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 2019 మార్చిలో 1,300 కోట్ల డాలర్లుగా ఉన్న జాంగ్ సంపద ఎనిమిది రెట్లకుపైగా పెరిగింది. సెప్టెంబరులో జాంగ్ సంపద 1,200 కోట్ల డాలర్లకు పైగా పెరగడం విశేషం. బైట్‌డ్యాన్స్ ఏఐ వెంచర్స్, టిక్‌టాక్ విస్తరణ ఈయన సంపద గణనీయంగా పెరగడానికి దోహదపడ్డాయి. ఇది సాంప్రదాయ పరిశ్రమలతో పోల్చితే పెరుగుతున్న ఏఐ కంపెనీల ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టం చేస్తోంది. డౌబావో చాట్‌బాట్, సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్ వంటి ఉత్పత్తుల ద్వారా బైట్‌డ్యాన్స్ వేగంగా విస్తరించింది. జాంగ్ ఇప్పటికే చైనాలో అత్యంత సంపన్నుడిగా మారిపోయారు.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు