MDR అంటే సెస్, పన్ను కాదు.. ప్రజలపై భారం ఉండదు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:59 PM
యూపీఐ ఎండీఆర్ చార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ చార్జీలతో ప్రజలపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎండీఆర్ చార్జీ సెస్స్ లేదా పన్ను కాదని అన్నారు. కాబట్టి ప్రజలపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఏమీ లేదని చెప్పారు.
చెల్లింపుల వ్యవస్థ నిర్మహణకు బలోపేతానికి ఎండీఆర్ చార్జీలు ఉపయోగిస్తారని కేంద్ర మంత్రి వివరించారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థతో ముడిపడ్డ సంస్థలే ఈ చార్జీలను పంచుకుంటాయని చెప్పారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై ఇప్పటికే వ్యాపారులు ఎండీఆర్ చార్జీలు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. కాబట్టి యూపీఐ ఎండీఆర్ చార్జీ కొత్తదేమీ కాదని అన్నారు. కస్టమర్లపై భారం పడుతున్నట్టు భావించకూడదని చెప్పారు.
అక్టోబర్ 15 నుంచీ ఎండీఆర్ చార్జీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఈ చార్జీని చెల్లింపుల విలువలో 0.4 శాతంగా ఎన్‌పీసీఐ ఖరారు చేసింది. రూ.2 వేలకు పైబడిన కొన్ని వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ఈ చార్జీ విధించనున్నారు. అంతేకాకుండా, ఈ చార్జీ గరిష్ఠంగా రూ.300 దాటకూడదని కూడా ఎన్‌పీసీఐ పేర్కొంది. ఇక అత్యవసర సేవలైన రైల్వే, టెలికం, ఫ్యూల్, ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో ఎండీఆర్ చార్జీని రూ.5 కే పరిమితం చేశారు.
అంతేకాకుండా, చిన్న వ్యాపారాలకు నెలకు రూ.1 లక్షల వరకూ ఎండీఆర్ చార్జీలు కూడా ఉండవని ప్రభుత్వం పేర్కొంది. 96 శాతం వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపింది. ఎన్‌పీసీఐ చెప్పేదాని ప్రకారం, ఎండీఆర్ చార్జీలో 40 శాతం కస్టమర్‌కు చెందిన బ్యాంకుకు వెళుతుంది. 30 శాతం పేమెంట్ గేట్‌వేకు, 20 శాతం యూపీఐ యాప్‌కు, 10 శాతం స్పాన్సరింగ్ బ్యాంకుకు చెందుతాయి.