వాడని బ్యాంకు ఖాతాలతో సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ABN , Publish Date - Aug 09 , 2026 | 03:28 AM
మీ పాత బ్యాంకు ఖాతాలు లేదా వినియోగించని క్రెడిట్ కార్డులను మూసివేస్తున్నారా? ఇలా చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ ఏమైనా తగ్గుతుందేమోనన్న ఆందోళన ఉందా? అయితే మీ అనుమానాల నివృత్తి కోసం...
మీ పాత బ్యాంకు ఖాతాలు లేదా వినియోగించని క్రెడిట్ కార్డులను మూసివేస్తున్నారా? ఇలా చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ ఏమైనా తగ్గుతుందేమోనన్న ఆందోళన ఉందా? అయితే మీ అనుమానాల నివృత్తి కోసం ఈ స్టోరీ చదవండి..
ఈ రోజుల్లో చాలా మందికి చాలా బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే వీటిలో అన్నింటినీ వినియోగించని వారుంటారు. వాటి పై దృష్టి పడినప్పుడు వాడని బ్యాంకు ల ఖాతాలు, క్రెడిట్ కార్డులు ఎందుకు? మూసివేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. ఒకవేళ అలా మూసివేస్తే సిబిల్ స్కోర్ ఏమైనా దెబ్బతింటుందా అన్న అనుమానం వస్తుంది. సిబిల్ స్కోర్ అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. తిరిగి చెల్లించే అలవాటు, క్రెడిట్ వినియోగం, ఎక్కువ గా రుణ విచారణలు, సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర వంటివి ఇందులో ఉంటాయి. అయితే పాత క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడవచ్చని, అయితే ఇది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకు ఖాతాల విషయానికివస్తే..
సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంకు ఖాతాలున్న వారు వాటిలో ఒక దాన్ని మూసివేస్తే దాని వల్ల వారి సిబిల్ స్కోర్‌పై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే డిపాజిట్ ఖాతాల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయకపోవడమే కారణం. అంటే బ్యాంకు ఖాతాలు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో భాగం కాదన్నమాట. అయితే మీరు క్లోజ్ చేసే ఖాతా ఒకవేళ మీరు చెల్లించాల్సి ఉన్న రుణ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం లింక్ చేసి ఆటో డెబిట్ ఆదేశాలు ఇచ్చి ఉంటే మాత్రం పరోక్షంగా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడవచ్చు. సదరు ఖాతాను మూసివేసే ముందు మీరు గనక ఆ ఆదేశాలను అప్‌డేట్ చేయకపోయినట్లయితే చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు చెల్లింపులు మిస్సయినట్టు క్రెడిట్ బ్యూరోలు రిపోర్ట్ చేయవచ్చు. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను దెబ్బతీయవచ్చు. అందుకే ఒక ఖాతాను మూసివేసే ముందు దానితో అనుసంధానం చేసిన ఆటో డెబిట్ మాండేట్‌లను ఒకసారి చూసుకోండి. అలాంటివి ఏమైనా ఉండే వాటిని మీరు ఎక్కువగా వాడుతున్న ఖాతాకు మార్చుకోండి.
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారా..
ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. మీకున్న క్రెడిట్ కార్డుల్లో ఒకదాన్ని క్లోజ్ చేస్తే మీకు అందుబాటులో ఉండే క్రెడిట్ తగ్గిపోతుందన్న విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు మీ దగ్గరున్న క్రెడిట్ కార్డుల మొత్తం క్రెడిట్ పరిమితి రూ.5 లక్షలు అనుకుంటే అందులో మీరు వినియోగించుకునే మొత్తం రూ.లక్ష అయితే మీ క్రెడిట్ వినియోగం 20 శాతం అన్నట్టు. ఒకవేళ మీరు రూ.లక్ష పరిమితి ఉన్న కార్డును మూసివేస్తే మీకు అందుబాటులో క్రెడిట్ రూ.4 లక్షలకు తగ్గిపోయి మీ క్రెడిట్ వినియోగం 25 శాతానికి పెరుగుతుంది. ఇక చాలా కాలంగా ఉంటున్న కార్డును మూసివేయడం వల్ల సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ వల్ల కలిగే ప్రయోజనం కూడా తగ్గవచ్చు.
ప్రభావితం చేసే అంశాలు..
సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే వాటిలో తిరిగి చెల్లింపు ప్రవర్తన, వివిధ రుణ ఖాతా లు, ఇటీవలి రుణ విచారణలతో పాటు సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర అనేది మీ స్కోర్‌ను ప్రభావితం చేసే కీలకమైన అంశాల్లో ఒకటి. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ.. కాలక్రమేణా మీరు క్రెడిట్‌ను ఎలా నిర్వహించారనే దానిపై రుణ దాతలకు ఒక స్పష్టతను ఇస్తుంది. అలాగే మీరు తిరిగి చెల్లించే విషయంలో అనుసరించే క్రమశిక్షణను అంచ నా చేయడాన్ని సులభతరం చేస్తుంది. అందుకే మీరు బాగా నిర్వహించిన క్రెడిట్ ఖాతా మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. ఒకవేళ మీ పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోవచ్చు. అప్పుడు మీ స్కోర్‌పైనా ప్రభావం పడవచ్చు. అందుకే అలాంటి కార్డుపై వార్షిక ఫీజు లేనట్టయితే అప్పుడప్పుడూ వాడు తూ యాక్టివ్‌గా ఉంచుకోవడం మేలు. ఎందుకంటే ఇది మీ క్రెడిట్ హిస్టరీని కాపాడటంతో పాటు దీర్ఘకాలంలో బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌కూ తోడ్పడుతుంది.
మీకు ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయనేది కాకుం డా సకాలంలో తిరిగి చెల్లించడం, క్రమశిక్షణతో కూడిన వినియోగం, పాత క్రెడిట్ కార్డుల నిర్వహణ వంటివి మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై అధిక ప్రభావం చూపుతాయి. అందుకే మీరు ఎన్ని క్రెడిట్ కార్డులను నిర్వహించగలుగుతారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తమ క్రెడిట్ హిస్టరీపై పడే ప్రభావాన్ని పరిశీలించకుండానే కొందరు చాలా ఏళ్లుగా వాడుతున్న తమ పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తుంటారు. కానీ ఇలాంటి పొరపాటు చేయకపోవడం మంచిది. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ అనేది క్రెడిట్ ప్రొఫైల్‌లో ముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి. ఇక ఏదైనా క్రెడిట్ కార్డు మూసివేసే ముందు మీరు చెల్లించాల్సిన మొత్తం బకాయిలను చెల్లించండి. అలాగే ఆ కార్డు మీ క్రెడిట్ హిస్టరీకి ఎంతగా దోహదపడుతుందో ఒక్కసారి చూసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ