ఎన్నారైలకు బడ్జెట్ బూస్ట్: భారత మార్కెట్లలో పెరగనున్న పెట్టుబడులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:08 PM
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. భారత స్టాక్ మార్కెట్‌లో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మరోవైపు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు.
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్
భారత్ స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పరిమితి పెంపు
మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంపు: నిర్మల
5లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి: నిర్మల
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రవాస భారతీయులకు (NRIs), ఇంకా దేశ మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఈ నిర్ణయాలు విదేశాల్లోని భారతీయులను స్వదేశీ మార్కెట్ల వైపు ఆకర్షించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేలా ఉన్నాయి.
పెట్టుబడి పరిమితి పెంపు:
గతంలో భారత కంపెనీల ఈక్విటీల్లో ప్రవాస భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తుల (PROIs) పెట్టుబడి పరిమితి 10% ఉండగా, దానిని ఇప్పుడు 24% కి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. తద్వారా ఎన్నారైలు భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు.
సులభతర పెట్టుబడులు:
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) ద్వారా లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే పరిమితిని కూడా 5% నుండి 10%కి పెంచారు. దీనివల్ల విదేశాల నుంచి భారత మార్కెట్లోకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.2 లక్షల కోట్లు
దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల రంగానికి (Infrastructure) ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయాన్ని (Capex)రూ. 12.2 లక్షల కోట్లు గా నిర్ణయించారు. ఇది గత ఏడాది (రూ. 11.2 లక్షల కోట్లు) కంటే సుమారు 9% ఎక్కువ. ఈ నిధులను ప్రధానంగా రైల్వేలు, రోడ్లు, హైవేలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్-బెంగళూరు, పూణే-హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం విశేషం.