Share News

వాణిజ్య భవనాలను అద్దెకు ఇస్తుంటే..?

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:53 AM

హరి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తాను పొదుపు చేసిన డబ్బుతో ఒక మంచి ఏరియాలో కొంత స్థలం కొన్నాడు. కొన్నేళ్లలో ఆ ఏరియా ఒక మంచి వాణిజ్య ప్రాంతంగా రూపుదిద్దుకుంది దాంతో తాను కొన్న స్థలంలో ఒక బిల్డింగ్‌ కట్టి ఒక కార్పొరేట్‌ కంపెనీకి...

వాణిజ్య భవనాలను అద్దెకు ఇస్తుంటే..?

హరి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తాను పొదుపు చేసిన డబ్బుతో ఒక మంచి ఏరియాలో కొంత స్థలం కొన్నాడు. కొన్నేళ్లలో ఆ ఏరియా ఒక మంచి వాణిజ్య ప్రాంతంగా రూపుదిద్దుకుంది దాంతో తాను కొన్న స్థలంలో ఒక బిల్డింగ్‌ కట్టి ఒక కార్పొరేట్‌ కంపెనీకి అద్దెకు ఇచ్చాడు. దీని అద్దె సంవత్సరానికి రూ.20 లక్షలు దాటుతుంది అనుకుందాం. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం వాణిజ్య భవనాలకు 18 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అద్దె రూ.20 లక్షలు దాటుతుంది. కాబట్టి హరికి రిజిస్ట్రేషన్‌ పొందటానికి కానీ పన్ను చెల్లించటానికి ఎలాంటి మినహాయింపు లేదు. కానీ, హరికి ఇప్పటి వరకు జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ లేదు. జీఎ్‌సటీ గురించి ఎలాంటి అవగాహన లేదు. మరి దీని కోసం హరి జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలా? ఈ సమస్య ఒక్క హరికే కాదు చాలా మందికి ఉంటుంది.

జీఎస్‌టీ చట్టంలో మార్పులు

ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జీఎస్‌టీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ లేని వ్యక్తి తన వాణిజ్య భవనాన్ని లేదా వాణిజ్య సముదాయాన్ని లేదా అందులో భాగాన్ని ఏదేనీ కంపెనీకి లేదా వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చి.. సదరు వ్యాపార సంస్థ లేదా కంపెనీకి జీఎ్‌సటీలో రిజిస్ట్రేషన్‌ ఉంటే ఆ అద్దెపై జీఎ్‌సటీ చెల్లించాల్సిన బాధ్యత కూడా అద్దె చెల్లించే సంస్థదే. అంటే పై ఉదాహరణలో హరికి జీఎ్‌సటీలో ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేదు. సదరు కార్పొరేట్‌ కంపెనీకి రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లయితే సంబంధిత జీఎ్‌సటీ చెల్లించాల్సిన బాధ్యత ఆ సంస్థదే. దీన్ని రివర్స్‌ చార్జ్‌ మెకానిజం అంటారు. మరి ఆ కంపెనీకి ఆ మేర నష్టం కదా అంటే.. ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ మొత్తాన్ని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకు నెలకు రూ.2 లక్షల అద్దె అనుకుంటే, ఇంతకు ముందు కంపెనీ హరికి రూ.2 లక్షలు దానిపైన జీఎ్‌సటీ రూ.36,000 కలిపి చెల్లించేది. హరి రూ.2 లక్షలు ఉంచుకుని ప్రభుత్వానికి రూ.36,000 చెల్లించేవాడు. కంపెనీ తాను చెల్లించిన రూ.36,000 ఐటీసీ రూపేణా తీసుకునేది. అయితే ఇందులో కొంత క్లిష్టత ఉండేది. హరి తొలుత రిజిస్ట్రేషన్‌ పొందాలి. నెలవారీ రిటర్నులు దాఖలు చేయాలి. తాను పొందిన అద్దెను సక్రమంగా చూపుతూ ప్రభుత్వానికి సంబంధిత జీఎ్‌సటీ సరిగా కట్టాలి. అంటే హరి విధివిధానాలను సరిగ్గా పాటించలేకపోతే సదరు కంపెనీ ఐటీసీ పొందలేదు. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త విధానంలో హరి రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కంపెనీ కూడా ఐటీసీ పొందటం సులువు.


10 షాపులు అద్దెకి ఇస్తే..

మరి ఇలా ఒక కంపెనీకి కాకుండా హరి తన బిల్డింగ్‌ను ఒక 10 షాపుల కింద విభజించి 10 మందికి అద్దెకు ఇచ్చాడనుకుందాం. అప్పుడు అద్దెకు తీసుకున్న అందరికీ రిజిస్ట్రేషన్‌ ఉంటే రివర్స్‌ చార్జ్‌ మెకానిజం కిందకు అందరూ వస్తారు. అందరు వారివారి అద్దెకు సంబంధించి జీఎ్‌సటీ చెల్లిస్తారు. మరి అందులో కొందరికి జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ లేకుంటే? అప్పుడు బిల్డింగ్‌ ఓనర్‌కు ఎంత అద్దె వస్తుందో చూడాలి. ఒకవేళ అద్దె మొత్తం రూ.20 లక్షలు దాటితే అప్పుడు బిల్డింగ్‌ ఓనర్‌ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్‌ తీసుకుంటాడో.. అప్పుడు రివర్స్‌ చార్జ్‌ మెకానిజం వర్తించదు. అంటే, అన్ని షాపులకు బిల్డింగ్‌ యజమాని జీఎ్‌సటీ చెల్లించాలి. అద్దెకు తీసుకున్న వ్యక్తులకు జీఎ్‌సటీ ఉన్నా లేకున్నా. క్లుప్తంగా చెప్పాలంటే వాణిజ్య భవనాల అద్దెకు సంబంధించి రివర్స్‌ చార్జ్‌ అనేది ఓనర్‌కు రిజిస్ట్రేషన్‌ లేకుండా అద్దెకు తీసుకున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ ఉన్నప్పుడే అమలవుతుంది. అయితే రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి కేవలం అద్దె మాత్రం కాకుండా ఇతర ఆదాయాన్ని కూడా చూడాలి.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?

Updated Date - Feb 15 , 2026 | 04:53 AM