ట్రంప్ టారీఫ్‌లపై ‘ఫార్మా’ బేఫికర్
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:14 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించిన సుంకాల (టారిఫ్)ను దేశీయ ఫార్మా కంపెనీలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2028 ఆగస్టు నుంచి 2029 ఆగస్టు మధ్య రెండు విడతలుగా...
మనకంటే అమెరికాకే ఎక్కువ నష్టం
ఏటా రూ.19.3 లక్షల కోట్ల భారం ఫ ప్రత్యామ్నాయం ఈజీ కాదు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించిన సుంకాల (టారిఫ్)ను దేశీయ ఫార్మా కంపెనీలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2028 ఆగస్టు నుంచి 2029 ఆగస్టు మధ్య రెండు విడతలుగా 100%, 200% చొప్పున ఈ టారీఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టారీఫ్‌లతో భారత జెనరిక్ ఫార్మా కంపెనీలు ఏటా 1,000 కోట్ల డాలర్ల ఎగుమతులనునష్టపోతే.. అమెరికా వినియోగదారులు మాత్రం ఏటా 20,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.19.30 లక్షల కోట్లు) వరకు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
47% వాటా భారత కంపెనీలదే..
అయితే భారత జెనరిక్ ఔషధాలకు అమెరికా సరైన ప్రత్యామ్నాయం కనుక్కోవడం అంత తేలిక కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో డాక్టర్లు రాసే మందుల్లో 90ు జెనరిక్ ఔషధాలే ఉంటాయి. అక్కడ విక్రయించే జెనరిక్ ఔషధాల్లో భారత కంపెనీల వాటా 47ు వరకు ఉంది. బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే వీటి ధర 7 నుంచి 10 రెట్లు తక్కువ. ఒకవేళ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా రెండేళ్లలో అక్కడే ప్లాంట్లు ఏర్పాటు చేసి.. జెనరిక్ ఔషధాలు ఉత్పత్తి చేయాలన్నా అంత తేలిగ్గా జరిగే పనికాదు. ఎంత బిజినెస్ ఫ్రెండ్లీ దేశమైనా అమెరికాలోనూ ఒక ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసి, ఉత్పత్తికి అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎంత లేదన్నా కనీసం ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుందని ఫార్మాగ్జిల్ చైర్మన్ నమిత్ జోషి చెప్పారు. పైగా ఈ ప్లాంటు ఏర్పాటు వ్యయం భారత్‌తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతో 100ు సుంకాలు విధించినా అమెరికా మార్కెట్లో భారత జెనరిక్స్‌కు పెద్దగా పోటీ ఉండక పోవచ్చని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ అమెరికా కంపెనీలు ఉత్పత్తి చేసిన జెనరిక్ ఔషధాలనే కొనాలన్నా అందుకు ఎంత లేదన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని జోషి తెలిపారు.
ట్రంప్ ప్లాన్ ఫలిస్తుందా?
విదేశీ జెనరిక్ కంపెనీలు అమెరికాలోనే తమ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఒత్తిడి చేయడం ట్రంప్ సర్కార్ అసలు ఉద్దేశం. దీనివల్ల ఏటా 21,300 కోట్ల డాలర్ల వరకు ఉన్న ఫార్మా దిగుమతులను చాలా వరకు తగ్గించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు సాధ్యమనే విషయాన్ని ట్రంప్ సర్కార్ పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే జెనరిక్స్‌తో పోలిస్తే బ్రాండెడ్ ఔషధాలపై లాభాలు ఎక్కువ. దీంతో ఫార్మా కంపెనీలు అమెరికాలో జెనరిక్ ఔషధాల ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేయడం అనుమానంగానే ఉంది. ‘అమెరికాలో అమ్మే ఔషధాల్లో జెనరిక్ ఔషధాల వాటా దాదాపు 90ు వరకు ఉంటుంది. అయితే మార్కెట్ విలువపరంగా చూస్తే వీటి వాటా 13ు మాత్రమే. మిగతా 87ు వాటా పేటెంట్, బ్రాండెడ్ ఔషధాలది. బ్రాండెడ్ ఔషధాలపై లాభాలు అధికం. కాబట్టి కంపెనీలు జెనరిక్ ఔషధాల కంటే బ్రాండెడ్ ఔషధాల ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతాయి’ అని నమిత్ జోషి చెప్పారు.
అమలు జరిగేనా?
ఇంత చేసినా జెనరిక్ ఔషధాలపై ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన బారీ సుంకాలు అమలవుతాయా? అంటే అనుమానంగానే ఉంది. అమెరికా ఓటర్లల్లో ఇప్పటికే ట్రంప్ జమానాపై అసంతృప్తి పెరిగిపోతోంది. మరో రెండున్నర సంవత్సరాల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు జెనరిక్ మందులపై ఈ సుంకాలు అమలు చేస్తే, అమెరికా పౌరుల హెల్త్ బడ్జెట్ పెరిగిపోయి.. రిపబ్లికన్లకు గుడ్‌బై చెప్పే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ సర్కార్ ఈ సుంకాలపై పునరాలోచనలో పడినా ఆశ్చర్యం లేదని పరిశ్రమ వర్గాల అంచనా. మొత్తం మీద ఈ సుంకాల పోటు ప్రభావం భారత జెనరిక్ కంపెనీలపై భయపడేంత స్థాయిలో ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..