ప్రాపర్టీలకు డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:38 AM
సాధారణంగా ఇళ్లు కొనుగోలు లేదా అద్దెకు తీసుకునే సమయంలో ఆ ఇంట్లో వసతులు, చుట్టుపక్కలుండే సౌకర్యాలు, మౌలిక వసతులు, ఇరుగు పొరుగువారి గురించి వాకబు చేస్తుంటారు. అలాగే, ఆ ఇంట్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉందా..? అని తెలుసుకోవడమూ ఈ రోజుల్లో కీలకంగా మారింది.
ప్రత్యేక ప్లాట్‌ఫామ్, మొబైల్ యాప్‌ను విడుదల చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ: సాధారణంగా ఇళ్లు కొనుగోలు లేదా అద్దెకు తీసుకునే సమయంలో ఆ ఇంట్లో వసతులు, చుట్టుపక్కలుండే సౌకర్యాలు, మౌలిక వసతులు, ఇరుగు పొరుగువారి గురించి వాకబు చేస్తుంటారు. అలాగే, ఆ ఇంట్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉందా..? అని తెలుసుకోవడమూ ఈ రోజుల్లో కీలకంగా మారింది. ఇందుకోసం టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ ‘ఇంటిగ్రేటెడ్ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్’ (డీసీఆర్) ప్లాట్‌ఫామ్‌తో పాటు మొబైల్ యాప్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ప్లాట్‌ఫామ్.. ప్రాపర్టీ మేనేజర్లు, డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీలు, వినియోగదారులను అనుసంధానించనుందని ట్రాయ్ పేర్కొంది.
ప్రస్తుతం 23 అక్రెడిటెడ్ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీలు, 11 ప్రాపర్టీ మేనేజర్లు, 7 ప్రాపర్టీలు ఈ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకున్నాయి. డీసీఆర్ ప్లాట్‌ఫామ్ ద్వారా గృహ ప్రాజెక్టులు, వాణిజ్య సముదాయం లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్, డేటా కనెక్టివిటీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ట్రాయ్ విడుదల చేసిన మొబైల్ యాప్ ద్వారా ప్రాపర్టీ లోపల డిజిటల్ కనెక్టివిటీ పనితీరును పరీక్షించవచ్చు.
ఇది కొత్తగా ఇళ్లు, కార్యాలయం కొనుగోలు లేదా అద్దెకు తీసుకోబోయే వారికి ఉపయుక్తంగా ఉండనుంది. ఫైౖబర్ కేబుల్ అందుబాటు, ఆయా మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల సిగ్నల్స్ లభ్యత, బిల్డింగ్ లోపల ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఉన్న పరిష్కారాలు, వై-ఫై మౌలిక వసతుల ఆధారంగా ప్రాపర్టీలకు డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్‌ను కేటాయించనున్నారు. యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రాపర్టీల రేటింగ్ కోసం ఆ ప్రాపర్టీ పేరు, సర్టిఫికెట్ ఐడీ లేదా ప్రాంతం వంటి వివరాలతో అన్వేషించవచ్చు. ప్రాపర్టీల రేటింగ్‌ను పోల్చడంతో పాటు డిజిటల్ సంతకంతో కూడిన రేటింగ్ సర్టిఫికెట్‌ను క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు.