Share News

పబ్లిక్‌ ఇష్యూకి టెక్నో పెయింట్స్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:50 AM

తెలంగాణ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్నోపెయింట్స్‌ అండ్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది

పబ్లిక్‌ ఇష్యూకి టెక్నో పెయింట్స్‌
TECHNOPAINTS

  • రూ.500 కోట్ల

సమీకరణ లక్ష్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్నోపెయింట్స్‌ అండ్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కొత్త ఈక్విటీ షేర్ల జారీతో రూ.325 కోట్లు సమీకరించనుండగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు... ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) ద్వారా రూ.175 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారని కంపెనీ ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. కాగా ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.65 కోట్లు సమీకరించాలని టెక్నోపెయింట్స్‌ యోచిస్తోంది. ఆకూరి శ్రీనివాస రెడ్డి ప్రమోట్‌ చేసిన టెక్నోపెయింట్స్‌.. రియల్టీ డెవలపర్లు, బిల్డర్లకు టర్న్‌కీ ప్రాతిపదికన అవసరమైన పెయింట్‌ సరఫరాలు, ఇతరత్రా సేవలను అందిస్తోంది. దీంతోపాటు బీ2బీ కస్టమర్లకు నేరుగా పుట్టీస్‌, పెయింట్స్‌, ఎమల్షన్స్‌, ఎనామిల్స్‌ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి 28 ఫ్రాంచైజీ రిటైల్‌ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది.

రూ.149 కోట్లతో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు

తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.149 కోట్లను కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించనుండగా, రూ.80 కోట్లను మూలధన అవసరాలు, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు టెక్నోపెయింట్స్‌ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్‌ సమీపంలోని చీర్యాల్‌, పాశమైలారంల్లో రెండు ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పౌడర్‌ పెయింట్స్‌ ఉత్పత్తి సామర్థ్యం 1,03,896 ఎంటీపీఏలుగా ఉండగా లిక్విడ్‌ పెయింట్స్‌ సామర్థ్యం 22,199 కేఎల్‌పీఏలుగా ఉంది. ప్రతిపాదిత ప్లాంట్‌ ఏర్పాటుతో పౌడర్‌ పెయింట్స్‌ స్థాపిత సామర్థ్యం 2,34,000 ఎంటీపీఏలకు లిక్విడ్‌ పెయింట్స్‌ ఉత్పత్తి సామర్థ్యం 31,200 కేఎల్‌పీఏలకు చేరుకుంటుందని డీఆర్‌హెచ్‌పీలో టెక్నోపెయింట్స్‌ పేర్కొంది. జూలై నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.994.70 కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.350.50 కోట్ల రెవెన్యూపై రూ.37.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - Sep 30 , 2026 | 02:53 AM