టెక్ మహీంద్రా లాభంలో 28.4 శాతం వృద్ధి
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:29 AM
ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) రూ.1,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది..
క్యూ1లో రూ.1,465 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) రూ.1,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభంతో పోల్చితే వృద్ధి 28.4 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రాబడి 17.7 శాతం పెరిగి దాదాపు రూ.15,712 కోట్లకు చేరుకుంది. డాలర్‌పరంగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబడి 1,660 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 2.2 శాతం ఎక్కువ కాగా వార్షిక ప్రాతిపదికన 6.1 శాతం అధికం. తొలి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను సాధించిందని, పరిశ్రమలోనే అధిక వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జోషి పేర్కొన్నారు. కంపెనీపరంగా చూస్తే డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్నారు. సామర్థ్యాల అభివృద్ధి, ప్రతిభావంతులైన ఉద్యోగుల నియామకం, కొత్త క్లయింట్లను సంపాదించుకోవడం, కన్సాలిడేషన్ డీల్స్‌ను సొంతం చేసుకోవడం వంటి వాటి కోసం చేసిన కృషి ఫలితాన్నిచ్చిందని తెలిపారు. ఇటీవలికాలంలో తమ కంపెనీ వృద్ధి తోటి సంస్థల సగటును అధిగమించడం ప్రారంభించిందన్నారు. 50 మిలియన్ డాలర్లకు మించిన వ్యాపారం అందించే క్లయింట్ల సంఖ్య ఏడు మేర పెరిగిందని తెలిపారు. ఆదాయాల విషయంలో స్పష్టత పరిమితంగా ఉండటంతో క్యాంపస్ నియామకాల ప్రక్రియలో కొంత అనిశ్చితి నెలకొందని, ఇప్పుడు ఆదాయాలపై స్పష్టత పెరగడంతో క్యాంపస్ నియామకాల కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నట్టు జోషి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక