Share News

టాటా సన్స్‌ లిస్టింగ్‌కే ఎస్‌పీ మద్దతుపారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది.

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:51 AM

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ లిస్టింగ్‌కే షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మద్దతు పలికింది. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కలిగిన ఎస్‌పీ గ్రూప్‌.. టాటా ట్రస్ట్‌ల తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు. టాటా సన్స్‌ లిస్టింగ్‌తో కంపెనీ కార్యకలాపాల్లో పారదర్శకతతో పాటు ప్రజా జవాబుదారీతనం కూడా పెరుగుతుందని ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ శుక్రవారం అన్నారు

టాటా సన్స్‌ లిస్టింగ్‌కే   ఎస్‌పీ మద్దతుపారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది.
pallam ji

ఇది కేవలం ఆర్థిక, నియంత్రణపరమైన విషయమే కాదు.. సామాజిక, నైతిక ఆవశ్యకత కూడా..

ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ పల్లోంజీ మిస్త్రీ

ముంబై: టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ లిస్టింగ్‌కే షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మద్దతు పలికింది. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కలిగిన ఎస్‌పీ గ్రూప్‌.. టాటా ట్రస్ట్‌ల తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు. టాటా సన్స్‌ లిస్టింగ్‌తో కంపెనీ కార్యకలాపాల్లో పారదర్శకతతో పాటు ప్రజా జవాబుదారీతనం కూడా పెరుగుతుందని ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ శుక్రవారం అన్నారు. కంపెనీలో మెజారిటీ (66 శాతం) వాటాదారులైన టాటా ట్రస్ట్‌లు లిస్టింగ్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రెండో అతిపెద్ద వాటాదారు మాత్రం భిన్న స్వరం వినిపిస్తుండటం గమనార్హం.

నోయల్‌ ససేమీరా..

మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ (చంద్ర)ను నియమించిన టాటా సన్స్‌ బోర్డు.. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థ షేర్లను మార్కెట్లో నమోదు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే, టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయల్‌ టాటా మాత్రం చంద్ర పునర్‌ నియామకంతో పాటు కంపెనీ లిస్టింగ్‌ను కూడా వ్యతిరేకించారు. లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని నోయల్‌ కంపెనీని కోరారు. అయితే, టాటా సన్స్‌ లిస్టింగ్‌ కేవలం ఆర్థిక, నియంత్రణ పరమైన విషయం మాత్రమే కాదని.. సామాజిక, నైతిక ఆవశ్యకత అని షాపూర్‌ మిస్త్రీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, టాటా ట్రస్ట్‌ల దాతృత్వ పాత్రను కాపాడుకుంటూనే సంస్థ పాలన ప్రమాణాలను పటిష్ఠం చేసుకునేందుకు ఇదొక అవకాశమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విబేధాలకు తావివ్వకుండా వాటాదారులు, టాటా గ్రూప్‌ ట్రస్టీలు, డైరెక్టర్ల మధ్య సయోధ్య అవసరమన్నారు. ఇందుకోసం టాటా సన్స్‌, టాటా ట్రస్ట్‌లతో కలిసి పనిచేసేందుకు ఎస్‌పీ గ్రూప్‌ సిద్ధంగా ఉందన్నారు. ఎవరో ఒకరు నెగ్గాలన్నది ఉద్దేశం కాదు. కానీ, సుస్థిర సంస్థ, భారీగా దాతృత్వం, గొప్ప జవాబుదారీతనం, విస్తృత భాగస్వామ్యం.. అంతిమంగా దేశానికి గొప్ప సేవ అందించడమే లక్ష్యం కావాలని పల్లోంజీ అన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 01:52 AM