టాటా సన్స్‌కు షాక్
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:09 AM
టాటా గ్రూప్ వ్యాపారాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సంస్థ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సు రద్దు
దరఖాస్తును తిరస్కరించిన ఆర్‌బీఐ
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తప్పనిసరి
ముంబై: టాటా గ్రూప్ వ్యాపారాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లో షేర్ల నమోదును తప్పించుకునేందుకు కంపెనీ తన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సు రద్దు కోసం 2024 మార్చిలో సమర్పించిన దరఖాస్తును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై ఆర్‌బీఐ, టాటా గ్రూప్ వర్గాలెవరూ అధికారికంగా స్పందించలేదు. ఆర్‌బీఐ తిరస్కరణతో టాటా సన్స్ కూడా పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లో తన షేర్లను నమోదు చేయడం తప్పనిసరి కానుంది. ఎందుకంటే, ఆర్‌బీఐ గత నెలలో విడుదల చేసిన అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)ల తాజా జాబితాలో టాటా సన్స్ పేరును కొనసాగించింది. ఈ లిస్ట్‌లోని కంపెనీలు మరింత కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పాలనపరమైన, పెట్టుబడి, సమాచార బహిర్గత నిబంధనలు పాటించేందుకు ఈ కంపెనీలు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఏంటీ అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలు..?
రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన, కఠిన పర్యవేక్షణ అవసరమైన 17 ఎన్‌బీఎ్‌ఫసీలు, కోర్ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ (సీఐసీ)లను ఆర్‌బీఐ ఈ జాబితాలో చేర్చింది. ఈ మార్చి చివరి నాటికి టాటా సన్స్ ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్ల పైమాటే. టాటా సన్స్ ప్రస్తుతం ఎన్‌బీఎ్‌ఫసీలోని సీఐసీ విభాగంలో నమోదై ఉంది. కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉండటమే సీఐసీ ప్రధాన వ్యాపారం.
టాటా సన్స్ లిస్టింగ్‌కు నోయల్ నో
స్టాక్ మార్కెట్లో టాటా సన్స్ లిస్టింగ్‌కు టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా సుముఖంగా లేరు. టాటా ట్రస్ట్‌ల దాతృత్వ కార్యక్రమాలకు టాటా సన్స్ లిస్టింగ్ అవాంతరంగా మారవచ్చన్నది నోయల్ టాటా వాదన. అయితే, టాటా ట్రస్ట్ సభ్యుల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. లిస్టింగ్‌తో టాటా సన్స్ విలువ పెరగడంతో పాటు పాలనలో పారదర్శకత పెరుగుతుందని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యం గా టాటా సన్స్‌లో 18 శాతం వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్.. కంపెనీ లిస్టింగ్‌కు పట్టుబడుతోంది. మార్కెట్లో లిస్టింగ్ ద్వారానే తమ వాటాకు సరైన విలువ లభిస్తుందని ఆ గ్రూప్ భావిస్తోంది.