టాటా సన్స్ బోర్డు భేటీ.. కొత్త వ్యాపారాల పనితీరుపై సమీక్ష
ABN , Publish Date - May 27 , 2026 | 05:28 AM
టాటా గ్రూప్‌లో లుకలుకల నేపథ్యంలో ఈ వ్యాపార సామ్రాజ్యంలోని ప్రధాన కంపెనీ టాటా సన్స్ బోర్డు సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ముంబైలోని గ్రూప్ ప్రధాన కార్యాలయం...
ముంబై: టాటా గ్రూప్‌లో లుకలుకల నేపథ్యంలో ఈ వ్యాపార సామ్రాజ్యంలోని ప్రధాన కంపెనీ టాటా సన్స్ బోర్డు సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ముంబైలోని గ్రూప్ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్ సహా బోర్డులోని ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. టాటా ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య అంతర్గత విబేధాలు, ఎయిరిండియాతో పాటు గ్రూప్ కొత్త కంపెనీల భారీ నష్టాలపై ఆందోళనలు, టాటా సన్స్ లిస్టింగ్‌పై నోయల్ టాటా విముఖత, చంద్రశేఖరన్‌ను మూడో టర్మ్ చైర్మన్‌గా కొనసాగిస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో టాటా సన్స్ బోర్డు తాజా భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం నోయల్ టాటా, చంద్రశేఖరన్ సహా బోర్డు సభ్యులెవరూ మీడియాతో మాట్లడకుండానే వెళ్లిపోయారు. సంస్థ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈసారి సమావేశంలో ఎయిరిండియాతో పాటు గ్రూప్ నవతరం కంపెనీలైన టాటా డిజిటల్, టాటా ఎలకా్ట్రనిక్స్ ఆర్థిక పనితీరు, వాటి భవిష్యత్ పెట్టుబడి అవసరాలపైనే సమగ్ర సమీక్ష జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్, టాటా ఎలకా్ట్రనిక్స్ సారథి రణధీర్ ఠాకూర్, టాటా డిజిటల్ చీఫ్ సాజిత్ శివనందన్ బోర్డు సభ్యులకు కంపెనీల పనితీరుపై ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు వారి సందేహాలను నివృత్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్‌నకు చెందిన ఈ అన్ లిస్టెడ్ కంపెనీలు రూ.10,905 కోట్ల నష్టాలను చవిచూశాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో వీటి నష్టాలు రూ.29,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
వచ్చేనెల 12న తదుపరి సమావేశం
టాటా సన్స్ బోర్డు వచ్చే నెల 12న మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది. చంద్రశేఖరన్‌కు మూడో టర్మ్‌తోపాటు టాటా సన్స్ లిస్టింగ్ అంశాలు తదుపరి భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..