Share News

సన్‌ ఫార్మా గూటికి ఆర్గనాన్‌ అండ్‌ కో

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:21 AM

భారత ఔషధ రంగంలో మెగా డీల్‌ కుదిరింది. దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్‌ ఫార్మా కంపెనీ సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ దిగ్గజం...

సన్‌ ఫార్మా  గూటికి  ఆర్గనాన్‌ అండ్‌ కో

రూ.1.10 లక్షల కోట్లకు అమెరికా కంపెనీ కొనుగోలు

భారత ఫార్మా రంగంలో ఇదే భారీ ఫారిన్‌ డీల్‌

దేశీ కంపెనీల అతిపెద్ద విదేశీ కొనుగోళ్లలో ఇదొకటి

న్యూఢిల్లీ: భారత ఔషధ రంగంలో మెగా డీల్‌ కుదిరింది. దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్‌ ఫార్మా కంపెనీ సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ దిగ్గజం ‘ఆర్గనాన్‌ అండ్‌ కో’ను టేకోవర్‌ చేయబోతోంది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న డీల్‌లో భాగంగా ఆర్గనాన్‌ను 1,175 కోట్ల డాలర్ల (రూ.1.10 లక్షల కోట్ల పైమాటే) ఎంటర్‌ప్రైజ్‌ విలువకు దక్కించుకోనుంది. భారత కార్పొరేట్‌ కంపెనీలు ఇప్పటివరకు విదేశాల్లో జరిపిన అతిపెద్ద కొనుగోళ్లలో ఇదొకటి. సన్‌ ఫార్మాతో పాటు దేశీయ ఫార్మా రంగంలో మాత్రం ఇదే అతిపెద్ద డీల్‌. ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఆర్గనాన్‌కు చెందిన ఒక్కో షేరుకు సన్‌ ఫార్మా 14 డాలర్ల చొప్పున చెల్లించనుంది. ఈ ఒప్పందానికి ఇరు కంపెనీల బోర్డులిప్పటికే ఆమోదం తెలిపాయి. నియంత్రణ మండళ్ల అనుమతులు, ఆర్గనాన్‌ షేర్‌హోల్డర్ల అనుమతులకు లోబడి 2027 లో ఈ ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా. ఈ డీల్‌కు అవసరమైన నిధుల సమీకరణ కోసం కంపెనీ వద్దనున్న 200-250 కోట్ల డాలర్ల నగదు నిల్వలను ఉపయోగించుకోవడంతో పాటు బ్యాంకుల నుంచి 925-975 కోట్ల డాలర్ల మేర రుణాలు సమీకరించనున్నట్లు సన్‌ ఫార్మా వెల్లడించింది.

టాప్‌-25లోకి సన్‌ఫార్మా: ఆర్గనాన్‌ కొనుగోలు ఒప్పం దం పూర్తయ్యాక సన్‌ఫార్మా 1,240 కోట్ల డాలర్ల వార్షికాదాయంతో ప్రపంచంలో 25 అతిపెద్ద ఔషధ కంపెనీల జాబితాలో చేరనుంది. అంతేకాదు, ప్రముఖ బ్రాండ్ల ఔషధాలు, బ్రాండెడ్‌ జనరిక్స్‌ పోర్ట్‌ఫోలియోతో కూడిన అంతర్జాతీయ అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటిగా ఎదగనుంది. ముఖ్యంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఔషధ మార్కెట్‌ అయిన చైనాలోకి ప్రవేశం కల్పిస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ విభాగంలో టాప్‌-3 కంపెనీగా అవతరించనుంది. 7వ అతిపెద్ద బయోసిమిలర్‌ కంపెనీగా మారనుంది. అలాగే, సన్‌ఫార్మా వ్యాపారం 150 దేశాలకు విస్తరించనుంది. అందులో 18 అతిపెద్ద మార్కెట్లు ఏటా 10 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అందించగలవు.


ఆర్గనాన్‌ గురించి..: అమెరికాకు చెందిన బహుళ జాతీయ ఔషధ దిగ్గజం మెర్క్‌ అండ్‌ కో నుంచి 2021లో విభజించి ఏర్పాటు చేసిన గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ కంపెనీయే ఆర్గనాన్‌ అండ్‌ కో. యూరోపియన్‌ యూనియన్‌తో పాటు వర్ధమాన మార్కెట్లలో కలిపి మొత్తం తయారీ యూనిట్లను కలిగి ఉందీ సంస్థ. మహిళల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల్లో అంతర్జాతీయ అగ్రగామి. వుమెన్స్‌ హెల్త్‌, జనరల్‌ మెడిసిన్స్‌ విభాగాల్లో 70కి పైగా ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. అందులో కొన్ని బయోసిమిలర్స్‌ సైతం ఉన్నాయి. అమెరికా, కెనడా, యూరప్‌, చైనా, బ్రెజిల్‌ సహా 140 దేశాల్లోకి విస్తరించిందీ సంస్థ. గత ఏడాదిలో ఆర్గనాన్‌ 620 కోట్ల ఆదాయంపై 190 కోట్ల నిర్వహణ లాభాన్ని (ఎబిటా) ఆర్జించింది. ప్రస్తుతం కంపెనీ 860 కోట్ల రుణభారాన్ని, 57.4 కోట్ల డాలర్ల నగదు నిల్వలను కలిగి ఉంది.

దేశీయ కంపెనీలు విదేశాల్లో జరిపిన భారీ కొనుగోళ్లు

  • టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్‌ 2007లో బ్రిటన్‌కు చెందిన ఉక్కు ఉత్పత్తి దిగ్గజం కోరస్‌ను 1,290 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

  • భారతీ ఎయిర్‌టెల్‌ 2010లో కువైట్‌కు చెందిన జైన్‌ టెలికాంకు చెందిన ఆఫ్రికా మార్కెట్‌ వ్యాపారాన్ని 1,070 కోట్ల డాలర్లకు దక్కించుకుంది.

  • హిందాల్కో ఇండస్ట్రీస్‌ 2007లో నోవెలి్‌సను 240 కోట్ల డాలర్ల రుణ భారంతో కలిపి మొత్తం 600 కోట్ల డాలర్లకు చేజిక్కించుకుంది.

  • టాటా మోటార్స్‌ 2025లో ఇటలీకి చెందిన ఇవెకో గ్రూప్‌ వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

  • భారతీ ఎయిర్‌టెల్‌ 2024లో యూకేకు చెందిన బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ సర్వీసస్‌ కంపెనీ బీటీ గ్రూప్‌లో 24.5 శాతం వాటాను 400 కోట్ల డాలర్లకు కొనగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

2-Business.jpg


సన్‌ ఫార్మా గత డీల్స్‌

  • 2014లో ర్యాన్‌బ్యాక్సీని 400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

  • 2007లో ఇజ్రాయెల్‌కు చెందిన టారో ఫార్మాను 45.4 కోట్ల డాలర్లకు టేకోవర్‌ చేసింది.

  • ఒప్పందం రద్దయితే 12 కోట్ల డాలర్ల చెల్లింపు

  • కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పక్షంలో తాము సన్‌ ఫార్మాకు 12 కోట్ల డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు ఆర్గనాన్‌ తెలిపింది.

ప్రజలను చేరుకోవడం, వారి జీవితాలను స్పృశించాలన్న కంపెనీ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ లావాదేవీ గణనీయ అవకాశాన్ని కల్పించనుంది. ఆర్గనాన్‌ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, సామర్థ్యాలు, అంతర్జాతీయ వ్యాప్తి మాకెంతగానో దోహదపడనున్నాయి. రెండు సంస్థల కలయిక మరింత బలమైన, వైవిధ్యభరితమైన వేదికను సృష్టించగలదని మేం భావిస్తున్నాం. భారీ ఒప్పందం కావడం, నిధులు సమకూర్చుకునేందుకు భారీగా రుణం తీసుకోవాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే నాకిది సంతోషకరమైన, ఉత్సాహకరమైన, కొంత ఆందోళనకరమైన క్షణం కూడా.

దిలీప్‌ సంఘ్వీ,

సన్‌ ఫార్మా చైర్మన్‌

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 06:21 AM