Share News

మార్కెట్లో ఊరట ర్యాలీ

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:22 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వరుసగా మూడు రోజులు భారీ నష్టాలు చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో...

మార్కెట్లో ఊరట ర్యాలీ

3 రోజుల తర్వాత లాభాల్లోకి సూచీలు

  • సెన్సెక్స్‌ 900 పాయింట్లు అప్‌

  • మళ్లీ 80,000 పైకి సూచీ

  • 24,750 ఎగువ స్థాయికి నిఫ్టీ

  • రూ.6 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వరుసగా మూడు రోజులు భారీ నష్టాలు చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌ ఆరంభం నుంచి పాజిటివ్‌గా ట్రేడైన సూచీలు.. ఆఖరి గంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారీ లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో 1,187.64 పాయింట్లు ఎగబాకి 80,303.83 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. చివరికి 899.71 పాయింట్ల (1.14 శాతం) లాభంతో 80,015.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 285.40 పాయింట్ల (1.17 శాతం) వృద్ధితో 24,765.90 వద్ద క్లోజైంది. కొనుగోళ్ల జోరుతో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.5.72 లక్షల కోట్లు పెరిగి రూ.452.90 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 19 రాణించాయి.

రూపాయికి బూస్ట్‌

భారత కరెన్సీ బుధవారం నమోదు చేసిన సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి నుంచి కాస్త తేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం 41 పైసలు పెరిగి రూ.91.64 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో లాభాలతో పాటు రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం ఇందుకు దోహదపడిందని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర 1.84 శాతం పెరిగి 82.90 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

Updated Date - Mar 06 , 2026 | 05:22 AM