Share News

టెక్‌ వ్యూ 23,000 వద్ద రికవరీ తప్పనిసరి

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:14 AM

గత వారం నిఫ్టీ ప్రారంభంలో మానసిక అవధి 23,000 స్థాయిలో మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 23,850 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైంది...

టెక్‌ వ్యూ 23,000 వద్ద రికవరీ తప్పనిసరి

గత వారం నిఫ్టీ ప్రారంభంలో మానసిక అవధి 23,000 స్థాయిలో మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 23,850 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైంది. తదుపరి డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ వారం మొత్తానికి 36 పాయింట్ల నష్టంతో 23,114 వద్ద వారం కనిష్ఠ స్థాయిలో క్లోజైంది. అయితే గరిష్ఠ స్థాయి నుంచి 750 పాయింట్ల మేరకు దిగజారడం అప్రమత్త సంకేతం. గత నాలుగు వారాలుగా నిరంతర డౌన్‌ట్రెండ్‌లో ఉన్న నిఫ్టీ భారీగా 8.2ు మేరకు నష్టపోయింది. గరిష్ఠ స్థాయిల నుంచి రియాక్షన్‌ సాధించిన మిడ్‌క్యాప్‌-100 సూచీ 95 పాయింట్లు, వరుసగా ఐదో వారం సైతం డౌన్‌ట్రెండ్‌లో ఉన్న స్మాల్‌క్యాప్‌-100 సూచీ 175 పాయింట్లు నష్టపోయాయి. ప్రస్తుతం నిఫ్టీ కీలక స్థాయి 23,000 వద్ద ఉంది. ఈ స్థాయిలో పరీక్ష ఎదుర్కొనడం వరుసగా ఇది మూడో వారం.

బుల్లిష్‌ స్థాయిలు: మార్కెట్‌ ఒకవేళ బలహీనతలో పడినా భద్రత కోసం 23,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ట్రెండ్‌లో సానుకూలత ఏర్పడాలంటే ఈ స్థాయి కన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 23,300, 23,500.

బేరిష్‌ స్థాయిలు: 23,000 వద్ద నిలదొక్కుకోవడం మరింత విఫలమైతే అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయిలు 22,700, 22,500. ఇక్కడ కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ సైతం గత వారం మొత్తంలో 330 పాయింట్లు నష్టపోయి 53,427 వద్ద ముగిసింది. కీలక స్థాయి 53,500 కన్నా దిగువన ముగియడం అప్రమత్త సంకేతం. సానుకూలత కోసం ఇక్కడ పునరుజ్జీవం సాధించి తీరాలి. మరింత బలహీనపడితే ప్రధాన మద్దతు స్థాయి 53,000 సమీపంలో కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి.

పాటర్న్‌: మార్కెట్లో ఓవర్‌సోల్డ్‌ స్థితి కొనసాగుతున్నందు వల్ల స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. 23,000 స్థాయిలో డబుల్‌ బాటమ్‌ పాటర్న్‌ ఏర్పడింది. ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,220, 23,300

మద్దతు : 22,900, 22,810

వి. సుందర్‌ రాజా

Updated Date - Mar 23 , 2026 | 06:15 AM