Share News

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:21 AM

ఏదేనీ పెద్ద వ్యాపార సంస్థలు, బ్యాంకులు లాంటివి వివిధ రాష్ట్రాల్లో షోరూమ్‌లు, ఆఫీసులు లేదా బ్రాంచీ (శాఖ)లు కలిగి ఉంటాయి. అలాగే వీటి మధ్య తరచు అనేక లావాదేవీలు...

హెడ్‌ ఆఫీస్‌ బ్రాంచీల మధ్య సర్వీసులకు జీఎ్‌సటీ వర్తిస్తుందా?

ఏదేనీ పెద్ద వ్యాపార సంస్థలు, బ్యాంకులు లాంటివి వివిధ రాష్ట్రాల్లో షోరూమ్‌లు, ఆఫీసులు లేదా బ్రాంచీ (శాఖ)లు కలిగి ఉంటాయి. అలాగే వీటి మధ్య తరచు అనేక లావాదేవీలు జరుగుతుంటాయి. అంటే హెడ్‌ ఆఫీస్‌, బ్రాంచీల మధ్య లేదా ఒక శాఖ, మరొక శాఖ మధ్య అనేక సర్వీసులు అందించటం, తీసుకోవటం జరుగుతుంది. జీఎ్‌సటీలో ఉచిత సర్వీస్‌ అందించే వ్యక్తి, పొందే వ్యక్తికి మధ్య ఎలాంటి సంబంధం లేకుంటే అలాంటి ఉచిత సర్వీసులకు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. అదే, రిలేటెడ్‌ లేదా డిస్టింక్ట్‌ పర్సన్స్‌ మధ్య జరిగే సర్వీసులు.. ఉచితంగా అయినప్పటికీ ఆ సర్వీ్‌సకు పన్ను మినహాయింపు ఉంటే తప్ప, మిగతా సందర్భాల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైన చెప్పిన హెడ్‌ ఆఫీస్‌, బ్రాంచీ లేదా ఒక బ్రాంచీ, ఇంకొక బ్రాంచీలు ‘డిస్టింక్ట్‌’ పర్సన్స్‌ కింద పరిగణిస్తారు. కాబట్టి సర్వీస్‌ ఉచితంగా జరిగినప్పటికీ నిబంధనల ప్రకారం తగు విలువ నిర్ధారించి సంబంధిత జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

డిస్టింక్ట్‌ పర్సన్‌ అంటే..

డిస్టింక్ట్‌ పర్సన్‌ అంటే.. ఒకటే పాన్‌తో ఒకటికి మించి జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్లు ఉంటే (అదే రాష్ట్రంలో కావచ్చు లేదా వేరే రాష్ట్రంలో కావచ్చు) ఆయా రిజిస్ట్రేషన్స్‌ను డిస్టింక్ట్‌ పర్సన్స్‌ అంటారు. ఉదాహరణకు ఒక పెద్ద నగల దుకాణం లేదా వస్త్ర దుకాణానికి హైదరాబాద్‌, విజయవాడల్లో షోరూమ్‌లు ఉన్నాయనుకుందాం. అప్పుడు తెలంగాణలో ఒక రిజిస్ట్రేషన్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఒక రిజిస్ట్రేషన్‌ ఉంటాయి. అలాగే ఒక రాష్ట్రంలో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ఉన్న వ్యాపార సంస్థకు ఇంకొక రాష్ట్రంలో బ్రాంచీ లేదా వ్యాపారానికి సంబంధించి ఒక ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఉంటే వాటిని కూడా ‘డిస్టింక్ట్‌’ పర్సన్స్‌ అంటారు. చట్టప్రకారం డిస్టింక్ట్‌ పర్సన్స్‌ మధ్య జరిగే ఉచిత సర్వీసులకు కూడా సంబంధిత జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. డిస్టింక్ట్‌ పర్సన్స్‌ మధ్య జరిగే సర్వీసుల్లో.. సర్వీస్‌ అందుకునే వ్యక్తికి పన్ను కింద చెల్లించిన మొత్తం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద తీసుకోవటానికి అర్హత ఉంటే ఉచిత సర్వీసులకు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. ఉదాహరణకు ఒక కంపెనీకి సంబంధించిన హైదరాబాద్‌ బ్రాంచీ అదే కంపెనీకి సంబంధించిన విజయవాడ శాఖకు ఒక ఉచిత సర్వీస్‌ అందించిదని అనుకుందాం. డిస్టింక్ట్‌ పర్సన్స్‌ కాబట్టి ఉచిత సర్వీస్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ సర్వీస్‌ రూ.లక్ష.. సంబంధిత సర్వీ్‌సకు 18 శాతం పన్ను అనుకుంటే లెక్క ప్రకారం హైదరాబాద్‌ బ్రాంచీ రూ.18,000 పన్ను కింద చెల్లించాలి. ఆ మేరకు విజయవాడ శాఖకు ఒక ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ ఇవ్వాలి. అయితే ఐటీసీ నిబంధనల ప్రకారం విజయవాడ బ్రాంచీకి సదరు రూ.18,000 ఐటీసీ తీసుకునే అర్హత ఉండే పక్షంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండే సౌలభ్యం కూడా ఉంది.


ఇంకా వివరంగా చెప్పాలంటే అవతలి వ్యక్తికి ఐటీసీ తీసుకునే అర్హత ఉన్నట్లయితే ఇన్వాయి్‌సలో చూపిన విలువనే మార్కెట్‌ విలువ కింద భావిస్తారు. అది ‘సున్నా’ కూడా కావచ్చు. ఒకవేళ సున్నా విలువ చూపాలంటే ఇన్వాయిస్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే హైదరాబాద్‌ బ్రాంచీ తాను ఉచితంగా అందించే సేవలకు మార్కెట్‌ విలువ మదింపు జరిపి పన్ను చెల్లించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకవేళ పన్ను చెల్లిస్తే ఆ మొత్తాన్ని అవతలి బ్రాంచీ ఐటీసీ కింద తీసుకునే పరిస్థితిలో ఉండాలి. అలా కాకుండా విజయవాడ శాఖకు ఐటీసీ అర్హత లేకున్నా.. అంటే తమ వినియోగదారులకు జీఎ్‌సటీ మినహాయింపు ఉన్న వస్తువులు విక్రయించటం వల్ల కావచ్చు లేదా ఏదేనీ నిబంధనల ప్రకారమైనా హైదరాబాద్‌ బ్రాంచీ అందించిన సర్వీ్‌సకు సంబంధించి విజయవాడ శాఖకు ఐటీసీ తీసుకునే అర్హత లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రం హైదరాబాద్‌ శాఖ తాను అందించిన సర్వీస్‌ ఉచితంగా అయినప్పటికీ పన్ను కచ్చితంగా చెల్లించాలి.

అయితే, ఈ సందర్భంలో నిర్ధారించే విలువలో ఆ సర్వీస్‌ అందించే ఉద్యోగస్తుల జీతాలను సర్వీస్‌ విలువలో కలపాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యవిషయం, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనేది ఒక ఐచ్ఛికం (ఆప్షన్‌). కావాలంటే సర్వీస్‌ అందించే శాఖ పన్ను చెల్లిస్తే.. అవతలి బ్రాంచీ ఎప్పటిలాగేనే క్రెడిట్‌ తీసుకోవచ్చు.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - Apr 05 , 2026 | 03:21 AM