Share News

చర్చలు విఫలం.. మార్కెట్‌ పతనం

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:01 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడకపోవచ్చన్న ఆందోళనలతో భారత్‌ సహా ప్రపంచ మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

చర్చలు విఫలం.. మార్కెట్‌ పతనం

  • ప్రారంభ ట్రేడింగ్‌లో 1,682 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌

  • 703 పాయింట్ల నష్టంతో 76,847 వద్ద ముగింపు

  • మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ.. రూ.2.1 లక్షల కోట్లు ఆవిరి

ముంబై: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడకపోవచ్చన్న ఆందోళనలతో భారత్‌ సహా ప్రపంచ మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో 1,681.93 పాయింట్లు పతనమై 75,868 వద్దకు జారుకున్న సెన్సెక్స్‌.. క్రమంగా కోలుకుని చివరికి 702.68 పాయింట్ల (0.91శాతం) నష్టంతో 76,847.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207.95 పాయింట్లు (0.86శాతం) కోల్పోయి 23,842.65 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.1 లక్షల కోట్లు తగ్గి రూ.449.13 లక్షల కోట్లకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 26 నష్టపోగా.. మారుతి సుజుకీ 4.61శాతం క్షీణించింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండిగో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి. బీఎస్ఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 0.82శాతం, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 0.33శాతం తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రూ.1,983.18 కోట్ల నికర విక్రయాలు చేపట్టగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నికరంగా రూ.2,432.30 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

రూపీ మళ్లీ క్రాష్‌

భారత కరెన్సీ భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్కరోజులో 52 పైసలు నష్టపోయి రూ.93.35 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల విఫలం, హోర్ముజ్‌ జలసంధిని దిగ్భందించనున్నట్లు అమెరికా ప్రకటించటంతో ముడి చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల పైకి ఎగబాకడం, దాంతో డాలర్లకు డిమాండ్‌ ఊపందుకోవడం రూపాయి క్షీణతకు కారణం. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర ఒక దశలో 7.73 శాతం పెరిగి 102.6 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

నేడు మార్కెట్లకు సెలవు

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. బుధవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

బంగారం, వెండి తగ్గాయ్‌..

విలువైన లోహాల ధరలు కాస్త తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.1,800 తగ్గుదలతో రూ.2,45,200కు దిగిరాగా.. 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ.300 తగ్గి రూ.1.55 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 4,722.26 డాలర్లు, సిల్వర్‌ 74.31 డాలర్లకు తగ్గాయి.

Updated Date - Apr 14 , 2026 | 04:01 AM