చిన్న నగరాల్లో 63శాతంపెరిగిన ఇళ్ల ధరలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:22 AM
దేశంలోని మెట్రో నగరాల్లో కంటే చిన్న నగరాలు, పట్టణాల్లోనే ఇళ్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 2021-2026 మధ్య కాలంలో దేశంలోని 11 చిన్న నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 63 శాతం పెరిగాయి.
సీఐఐ- నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని మెట్రో నగరాల్లో కంటే చిన్న నగరాలు, పట్టణాల్లోనే ఇళ్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 2021-2026 మధ్య కాలంలో దేశంలోని 11 చిన్న నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 63 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశంలోని 8 ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ధరలు 42 శాతం మాత్రమే పెరిగాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు, వినియోగ సామర్థ్యం పుంజుకోవడం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణమని సీఐఐ, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తెలిపాయి. విశాఖపట్నం సహా భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, గోవా, ఇండోర్, జైపూర్, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, కోయంబత్తూర్ వంటి నగరాలు రియల్టీ వృద్ధికి కీలక మార్కెట్లుగా నిలుస్తున్నాయని పేర్కొన్నాయి. కాగా 2016-2026 మధ్య ఈ నగరాల్లో ఇళ్ల ధరల్లో ఏటా సగటున 8 శాతం వృద్ధి రేటు నమోదు కాగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, కోల్‌కతా నగరాల్లో ఇది 4 శాతానికే పరిమితమైంది.