Share News

వెండి నగ.. ధగధగ!

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:28 AM

బంగారం ధర అనూహ్యంగా పెరగడంతో ఆభరణ ప్రియుల మనసు క్రమంగా వెండి పైకి మళ్లుతోంది. పేదోడి బంగారంగా పేరున్న వెండి.. ఇప్పుడు మధ్యతరగతి, సంపన్న వర్గాలనూ ఆకర్షిస్తోంది.

వెండి నగ.. ధగధగ!
SILVER

  • పసిడి ధర కొండెక్కడంతో సిల్వర్‌ జువెలరీకి పెరుగుతున్న గిరాకీ

  • దీపావళి సీజన్‌లో వెండి విక్రయాలు 18శాతం పెరిగే అవకాశం : ఐబీజేఏ

న్యూఢిల్లీ: బంగారం ధర అనూహ్యంగా పెరగడంతో ఆభరణ ప్రియుల మనసు క్రమంగా వెండి పైకి మళ్లుతోంది. పేదోడి బంగారంగా పేరున్న వెండి.. ఇప్పుడు మధ్యతరగతి, సంపన్న వర్గాలనూ ఆకర్షిస్తోంది. రోజువారీగా ధరించేందుకు చాలామంది బంగారానికి బదులు వెండి ఆభరణాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత వీటిని ఫ్యాషన్‌ జువెలరీగా ధరిస్తున్నారు. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు ఈ మధ్య కాలంలో జివ, ట్రైబ్‌, మియా, షాయా, క్విర్క్‌స్మిత్‌, హౌస్‌ ఆఫ్‌ ఆద్య వంటి ఎక్స్‌క్లూజివ్‌ సిల్వర్‌ ఆభరణాలు, ఉత్పత్తుల బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. అంతేకాదు, వెండి వస్తువులు, కళాకృతులను బహుకరించే ట్రెండ్‌ కూడా పెరిగిందని విక్రేతలంటున్నారు.

ట్రెండ్‌ మారుతోందా..?

వెండి ఆభరణాలపై ఆసక్తి పెరగడాన్ని బట్టి చూస్తే, దీర్ఘకాలంలో నగల కొనుగోలు అలవాట్లలో స్పష్టమైన రావచ్చని అన్పిస్తోందని ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. వెండి ధర కూడా భారీగానే పెరిగినప్పటికీ.. సామాన్యులు, మధ్యతరగతి వారికి ఇప్పటికీ అందుబాటు స్థాయిలోనే ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ దీపావళి సీజన్‌లో వెండి అమ్మకాలు 17-18 శాతం మేర పెరగవచ్చని ఐబీజేఏ అంచనా వేసింది.

సిల్వర్‌లో పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి

దేశంలో ప్రధానంగా వెండి ఆభరణాలు, నాణేలు, కడ్డీలతో పాటు వెండి సామాగ్రికి కూడా మంచి గిరాకీ ఉంది. అలాగే, సోలార్‌ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సహా ఇతర పారిశ్రామిక అవసరాలకూ వెండి వినియోగం అసాధారణ స్థాయిలో పెరిగింది. అంతేకాదు, గత ఏడాది వెండి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్)లో పెట్టుబడులు సంప్రదాయ లోహ వినియోగాన్ని మించిపోవడం గమనార్హం.


రెండేళ్లలో 160 శాతం పెరిగిన ధర

గడిచిన రెండేళ్లలో వెండి ధర 160 శాతం పెరిగింది. 2024 సెప్టెంబరులో రూ.89,537 స్థాయిలో ఉన్న కేజీ సిల్వర్‌.. ప్రస్తుతం రూ.2.32 లక్షల స్థాయికి చేరింది. గత ఏడాది కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలకు ఎగబాకినప్పటికీ, ఈ ఫిబ్రవరి-మార్చిలో మళ్లీ రూ.2 లక్షలకు దిగివచ్చింది.

Updated Date - Sep 30 , 2026 | 02:30 AM