వెండి ఈటీఎఫ్‌ల 'బ్లడ్‌బాత్'.. మధ్యాహ్నం తర్వాత కొంత ఊరట
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:37 PM
నేడు సిల్వర్ ఈటీఎఫ్‌లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ఉదయం లోయర్ సర్క్యూట్‌లను తాకిన తర్వాత, మధ్యాహ్న సమయానికి కొనుగోలు మద్దతు లభించడంతో కొన్ని ఈటీఎఫ్‌లు 10% వరకు రికవరీ అయ్యాయి.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 2: నేడు (సోమవారం) భారతీయ స్టాక్ మార్కెట్‌లో సిల్వర్ ఈటీఎఫ్‌లు (Silver ETFs) తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ పతనం నేడు కూడా కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కొంత కోలుకోవడం విశేషం.
సిల్వర్ ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి?
Silver ETFs (Exchange Traded Funds) గురించి సరళంగా చెప్పాలంటే... వెండిని భౌతికంగా (బిస్కెట్లు లేదా నాణేల రూపంలో) కొనాల్సిన అవసరం లేకుండా, షేర్ మార్కెట్ ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టే ఒక విధానం. వీటిలో నాణ్యత, భద్రత ఎక్కువ ఉంటుంది. అయితే, వెండి, బంగారం ఈటీఎఫ్‌ల మీద రుణాలు తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు.
వెండి ఈటీఎఫ్‌ల 'బ్లడ్‌బాత్'.. నేటి మార్కెట్ పరిస్థితి:
గత కొన్ని రోజులుగా చారిత్రక స్థాయిల నుండి పడిపోతున్న వెండి ధరలు, నేడు సిల్వర్ ఈటీఎఫ్‌లను అతలాకుతలం చేశాయి. కొన్ని ఈటీఎఫ్‌లు నేటి ట్రేడింగ్‌లో 20% లోయర్ సర్క్యూట్‌ను కూడా తాకాయి. సెషన్ ప్రారంభంలో Axis Silver ETF, ICICI Pru Silver ETF, Kotak Silver ETF వంటి ప్రధాన ఫండ్‌లు దాదాపు 19% నుండి 20% వరకు పడిపోయాయి.
మధ్యాహ్నం రికవరీ:
లోయర్ సర్క్యూట్‌లను తాకిన తర్వాత, మధ్యాహ్న సమయానికి కొనుగోలు మద్దతు లభించడంతో కొన్ని ఈటీఎఫ్‌లు 10% వరకు రికవరీ అయ్యాయి. ఉదాహరణకు, Axis Silver ETF లోయర్ సర్క్యూట్ నుండి కోలుకుని రూ. 231 స్థాయికి చేరుకుంది.
మూడు రోజుల్లో 40% గల్లంతు:
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో వెండి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 40శాతం పైగా ఆవిరైంది. ఇది ఇటీవలి కాలంలో అత్యంత వేగవంతమైన పతనంగా విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణాలు:
1. అమెరికా డాలర్ బలం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో, వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదించవచ్చని డాలర్ ఇండెక్స్ బలపడింది. ఇది వెండిపై ఒత్తిడి పెంచింది.
2. మార్జిన్ పెంపు: CME గ్రూప్ వెండి ఫ్యూచర్స్‌పై మార్జిన్ రిక్వైర్మెంట్‌ను 11% నుండి 15%కి పెంచడం వల్ల ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయాల్సి వచ్చింది.
3. బడ్జెట్ 2026 ప్రభావం: కేంద్ర బడ్జెట్‌లో వెండిపై దిగుమతి సుంకం తగ్గించవచ్చనే ఊహాగానాలు, ప్రాఫిట్ బుకింగ్ వెండి పతనానికి ఆజ్యం పోశాయి.
4. iNAV ప్రీమియం తగ్గడం: గతంలో ఈటీఎఫ్‌లు వాటి వాస్తవ విలువ (NAV) కంటే ఎక్కువ ప్రీమియంతో ట్రేడ్ అయ్యేవి. ఇప్పుడు అమ్మకాల ఒత్తిడితో ఆ ప్రీమియం కరిగిపోయి, ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
అటు, గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా ఇవాళ దాదాపు ఇదే తరహాలో ట్రేడ్ అయ్యాయి.