స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల సెల్ఫ్ లిస్టింగ్ సాధ్యమే..
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:56 AM
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు తమ షేర్లను సొంత ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయడం (సెల్ఫ్ లిస్టింగ్) సాధ్యమేనని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు.
సెబీ చేతుల్లో నిర్ణయాధికారం
ఎన్‌ఎస్ఈ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్
ముంబై: స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు తమ షేర్లను సొంత ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయడం (సెల్ఫ్ లిస్టింగ్) సాధ్యమేనని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. కానీ, ఈ అంశంపై నిర్ణయాధికారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేతుల్లో ఉందన్నారు. కాలానుగుణంగా నిబంధనలు మారుతున్న నేపథ్యంలో నేడు అనుమతి లేని వాటికి రేపు ఆమోదం లభించవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఉదాహరణకు, 2012 ముందు వరకు మార్కెట్ మౌలిక వసతుల సంస్థల (ఎంఐఐ) లిస్టింగ్ అనుమతి ఉండేది కాదని, కానీ ఆ తర్వాత ఎంఐఐల లిస్టింగ్‌కు అనుమతి లభించిందని.. 2015 నుంచి నిర్వహణలోకి వచ్చిందన్నారు. సెబీ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల షేర్ల సెల్ఫ్ లిస్టింగ్‌కు అనుమతి లేదు. అందుకే, ఐపీఓ అనంతరం ఎన్‌ఎ్‌సఈ తన షేర్లను బీఎస్ఈలో నమోదు చేసింది. బీఎస్ఈ షేర్లు చాలా కాలంగా ఎన్‌ఎస్ఈలో ట్రేడవుతున్నాయి.
సూచీల స్వల్ప రికవరీ
వారాంతం ట్రేడింగ్‌లో భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం నాటి భారీ నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. బ్లూచిప్ బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వాహన షేర్లలో కొనుగోళ్లతో మోస్తరుగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 315.20 పాయింట్లు పెరిగి 73,895.74 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 77.40 పాయింట్ల వృద్ధితో 23,140.50 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.లక్ష కోట్లు పెరిగి రూ.481.89 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పెరిగి రూ.95.80 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర ఒక దశలో 1.10 శాతం తగ్గి 105.4 డాలర్ల వద్ద ట్రేడైంది.
ఎన్‌ఎస్ఈ షేరు 1 శాతం డౌన్
రెండో రోజు ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్ఈ షేరు ధర 1.39 శాతం తగ్గి రూ.1,792.65 వద్ద ముగిసింది. దాంతో ఈ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ రూ.4.43 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో దేశంలోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో 12వ స్థానానికి జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ షేర్లు గురువారం బీఎ్‌సఈలో నమోదైన విషయం తెలిసిందే. ఇష్యూ ధర రూ.1,785తో పోలిస్తే, తొలిరోజు ట్రేడింగ్‌లో 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద స్థిరపడింది.
ఈ వార్తలు కూడా చదవండి