సీఏఎస్‌లో మార్పులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:56 AM
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఈ మధ్యనే ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్)లో పలు మార్పులను ప్రకటించింది.
ప్రతిపాదించిన సెబీ
చర్చా పత్రం విడుదల
అక్టోబరు 3లోగా అభిప్రాయాలు తెలియజేయండి
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఈ మధ్యనే ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్)లో పలు మార్పులను ప్రకటించింది. ఇండెక్స్, సింగిల్ స్టాక్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున వాటి సెటిల్‌మెంట్ ధరను నిర్ధారించేందుకు శనివారం విడుదల చేసిన చర్చా పత్రంలో రెండు ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించింది. అందులో మొదటిది.. చివరి 30 నిమిషాల నిరంతర ట్రేడింగ్ (సీటీఎస్)తోపాటు 10 నిమిషాల సీఏఎ్‌సను ఉపయోగించి లెక్కించిన మిశ్రమ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (వీడబ్ల్యూఏపీ). రెండోది.. కేవలం చివరి 30 నిమిషాల నిరంతర ట్రేడింగ్‌ను ఉపయోగించి లెక్కించే వీడబ్ల్యూఏపీ. అయితే, రెండో ప్రత్యామ్నాయం తాత్కాలికమేనని, సీఏఎ్‌సపై మార్కెట్ వర్గాలు అవగాహన పెంచుకునే వరకు మాత్రమే కొనసాగించడం జరుగుతుందని సెబీ స్పష్టం చేసింది. కనీసం ఏడాది తర్వాత మళ్లీ మొదటి ప్రత్యామ్నాయానికే మారాల్సి ఉంటుందని కూడా చర్చా పత్రం లో ప్రస్తావించింది. కొత్త ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు అక్టోబరు 3లోగా అభిప్రాయాలు, సూచనలు తెలపాలని సెబీ కోరింది.
వ్యతిరేకతల నేపథ్యంలోనే..
ప్రస్తుతం అమల్లో ఉన్న సీఏఎస్ ఆధారిత సెటిల్‌మెంట్ ధర నిర్ధారణ విధానంపై మార్కెట్ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెబీ ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెబీ సీఏఎ్‌సను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఎఫ్ అండ్ ఓ జాబితాలోని షేర్లలో 3.15 గంటలకు సాధారణ ట్రేడింగ్ ముగుస్తుంది. ఆ సమయం లో ముగింపు ధర నిర్ణయానికి బదులు.. 3.15 గంటల నుంచి 3.35 గంటల వరకు (20 నిమిషాల పాటు) నిర్వహించే క్లోజింగ్ యాక్షన్ సెషన్‌లో నమోదయ్యే క్రయ, విక్రయాల ఆర్డర్ల మొత్తం ఆధారంగా సమతుల్య ధర ఆవిష్కరణ విధానం (ఈక్విలిబ్రియం ప్రైజ్ డిస్కవరీ మెకానిజం) ద్వారా ఎక్స్ఛేంజీలు క్లోజింగ్ ధరను నిర్ణయిస్తాయి. అయితే, కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డెరివేటివ్ కాంట్రాక్టు ముగింపు తేదీల్లో సీఏఎస్ సెషన్‌లో సూచీలు కేవలం క్షణాల వ్యవధిలో వేల పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో పాటు కంపెనీల షేర్లు భారీగా ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇది ఆప్షన్స్ ట్రేడర్లకు ఇబ్బందిగా మారుతోందని సామాజిక మాధ్యమాల్లో ఇన్వెస్టర్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని మార్పులు..
ఐఐవీకి స్వస్తి: సీఏఎస్‌లో సూచిక సమతుల్య ధర (ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్- ఐఈపీ) నుంచి సాధించే ఇండికేటివ్ ఇండెక్స్ వాల్యూ (ఐఐవీ) ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించింది.
మార్కెట్ సమయంలో మార్పులు: రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది.
సీఏఎస్‌లో భాగమైన షేర్లలో సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు సాగుతుంది. 3.31నుంచి 3.40 వరకు సీఏఎస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ 3.45 వరకు సాగుతుంది.
సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3.15 గంటలకు ముగుస్తుంది. 3.15 నుంచి 3.25 వరకు సీఏఎస్ నిర్వహణ.. ఆ తర్వా త 3.30 వరకు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్.
అంతేకాదు, సీఏఎస్ సెషన్ పరివర్తన సమయాన్ని కూడా ప్రస్తుత 5 నిమిషాల నుంచి కేవలం నిమిషానికి కుదించాలని కూడా సెబీ ప్రతిపాదన చేసింది. సీఏఎస్ తర్వాత ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విండో ప్రస్తుతం 10నిమిషాలుగా ఉండగా.. కొత్త ప్రతిపాదనలో 5 నిమిషాలకు తగ్గనుంది.