Share News

ఎంఎఫ్‌ రంగంలో సెబీ భారీ సంస్కరణలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:40 AM

దేశ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పరిశ్రమలో భారీ సంస్కరణలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ శ్రీకారం చుట్టింది.

ఎంఎఫ్‌ రంగంలో సెబీ భారీ సంస్కరణలు

  • ఐదు తరగతులుగా పథకాల వర్గీకరణ

న్యూఢిల్లీ: దేశ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పరిశ్రమలో భారీ సంస్కరణలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గురువారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఎంఎఫ్‌ పథకాలను ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌, లైఫ్‌ సైకిల్‌, ఇతర పథకాల పేరుతో ఐదు రకాలుగా వర్గీకరించింది. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) పథకాలు, ఇండెక్స్‌ లేదా ఈటీఎ్‌ఫల వంటి పాసివ్‌ పథకాలను ‘ఇతర’ పథకాల్లో చేర్చింది. ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పటి వరకు రిటైర్మెంట్‌, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి నిర్ణీత అవసరాల కోసం ఉద్దేశించిన సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు సెబీ గుడ్‌బై చెప్పింది. ఈ పథకాల్లో తాజా పెట్టుబడుల స్వీకరణను వెంటనే ఆపివేయాలని కూడా ఎంఎ్‌ఫలను ఆదేశించింది. తన ముందస్తు అనుమతితో ఈ పథకాలను అదే తరహా రిస్క్‌, పెట్టుబడుల కేటాయింపులు ఉండే ఇతర పథకాల్లో విలీనం చేయాలని స్పష్టం చేసింది.

పేర్లలోనూ స్పష్టత

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు తమ పథకాల ప్రకటనల్లోనూ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని సెబీ స్పష్టం చేసింది. పథకం ఏ క్యాటగిరికి చెందినది, దాని లక్ష్యాలను సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పష్టంగా ఆఫర్‌ డాక్యుమెంట్‌, ప్రకటనల్లోనూ స్పష్టం చేయాలి. పథకం పేరు చివర్లోనూ ఆ పథకం ఏ క్యాటగిరికి చెందినదో కూడా స్పష్టం చేయాలని కోరింది. అలాగే పథకాల పేర్లలో ఎక్కడా ఆ పథకం నుంచి వచ్చే రాబడుల ప్రస్తావన ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా రిటైల్‌ మదుపరులకు రోజురోజుకి కఠినంగా మారుతున్న ఎంఎఫ్‌ పెట్టుబడులను సెబీ సులభతరం చేసిందని చాయిస్‌ వెల్త్‌ సీఈఓ నికుంజ్‌ సరాఫ్‌ చెప్పారు.


హద్దులపైనా..

ఆయా పథకాల్లో ఎంఎఫ్‌ సంస్థల పెట్టుబడుల పరిమితులనూ సెబీ స్పష్టం చేసింది. ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌, లైఫ్‌ సైకిల్‌, ఇతర పథకాలన్నీ తమ తమ క్యాటగిరికి వర్తించే నిబంధనలకు లోబడి మాత్రమే ఆయా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని పేర్కొంది. ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎ్‌ఫలు తమ మొత్తం నిధుల్లో కనీసం 95 శాతం మొత్తాన్ని ఆ ఇండెక్స్‌కు సంబంధించిన సెక్యూరిటీల్లోనే మదుపు చేయాలి. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌కీ ఇదే సూత్రం వర్తిస్తుందని సెబీ తెలిపింది.

లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ కాలపరిమితి 5 నుంచి 30 ఏళ్లు

సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ స్థానంలో సెబీ కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ పేరుతో ప్రత్యేక క్యాటగిరి ఫండ్స్‌ ప్రవేశపెట్టింది. ఈ ఫండ్స్‌ కాలపరిమితి ఐదు నుంచి 30 సంవత్సరాలు. తమ జీవిత లక్ష్యాలకు అనుగుణంగా మదుపరులు ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలను ఎంచుకోవచ్చు. అయితే ఈ పథకాల కాలపరిమితి ముగిసే వరకు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని అనుమతించరు. ఒకవేళ ఏడాది నుంచి మూడేళ్లలోపు వెనక్కి తీసుకుంటే ఒకటి నుంచి మూడు శాతం ఎగ్జిట్‌ లోడ్‌ చెల్లించాలి. ఈ పథకాల పెట్టుబడుల కోసం ఎంఎ్‌ఫలు క్రమానుగత పెట్టుబడుల విధానం అనుసరిస్తాయి. ఈ విధానంలో ముందు అధిక నష్టభయంతో పాటు అధిక రాబడులకు అవకాశం ఉన్న ఈక్విటీ షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. తరువాత క్రమంగా ఈక్విటీ పెట్టుబడులు తగ్గించుకుంటూ, పెద్దగా నష్టభయం లేకుండా స్థిరమైన రాబడులు ఇచ్చే రుణపత్రాల్లో పెట్టుబడులు పెంచుతారు. దీనివల్ల రిటైర్మెంట్‌, పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి మదుపరులు లక్ష్యాలు నెరవేరతాయి.


ఇతర ప్రధాన మార్పులు

  • ఈక్విటీ పథకాలు తమ నిధుల్లో 35 శాతం వరకు బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి

  • రుణ పత్రాల మెచ్యూరిటీ గడువు ఐదేళ్ల లోపు ఉంటే వాటి పరపతి రేటింగ్‌ కనీసం డబుల్‌ ఏ లేదా అంతకు మించి ఉండాలి

  • రుణ పత్రాల కాలపరిమితి కూడా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల కాలపరిమితికి లోబడి ఉండాలి

  • ఎంఎఫ్‌లు ఇక తమ పథకాల పెట్టుబడులు దేన్లోనైనా పరిమితికి మించి ఉంటే ప్రతి నెలా ఆ విషయాన్ని తమ వెబ్‌సైట్లలో పోస్టు చేయాలి

  • ఎంఎ్‌ఫలు జారీ చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌పై పరిమితులు

  • ప్రస్తుత పథకాలన్నీ6నెలల్లోగా కొత్త నిబంధనలకు అనుగుణంగా మారాలి

  • సెబీ నియంత్రణ పరిధిలోకి వచ్చే సంస్థలు, ఏజెంట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఏదైనా మార్కెట్‌ విషయాలు లేదా సెక్యూరిటీల గురించి పోస్టులు పెట్టేటప్పుడు తమ పేరు, రిజిస్ట్రేషన్‌ నంబరు వెల్లడించాలి

  • ఏప్రిల్‌ 1 నుంచి ఎంఎ్‌ఫలు తమ పథకాల నిర్వహణలో ఉన్న బంగారం, వెండి నిల్వల విలువను గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రకటించే స్పాట్‌ ధర ఆధారంగా లెక్కించాలి

  • లైఫ్‌ సైకిల్‌ పథకాల కనీస కాలపరిమితి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు

  • ప్రారంభించి ఏడాది కూడా పూర్తికాని పథకాలను యూనిట్‌ హోల్డర్ల అనుమతితో అదే కాలపరిమితి ఉన్న లైఫ్‌ సైకిల్‌ పథకాల్లో విలీనం చేయాలి

  • జూ5, 10, 15, 20, 25, 30 సంవత్సరాల మెచ్యూరిటీతో మాత్రమే లైఫ్‌ సైకిల్‌ పథకాలు ప్రారంభించాలి

  • ఈక్విటీ పథకాలు అన్నిటిలో కనీసం 65 నుంచి 75 శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉండాలి.

Updated Date - Feb 27 , 2026 | 12:40 AM