Share News

ఎస్‌బీఐ భళా!

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:52 AM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి..

ఎస్‌బీఐ భళా!

  • 14శాతం వృద్ధితో రూ.24,113 కోట్లకు జూన్‌ త్రైమాసిక లాభం

  • రూ.46,992 కోట్లకు బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం

  • 2 దశాబ్దాలకు పైగా కనిష్ఠానికి మొండి బకాయిలు

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 13.73 శాతం వృద్ధితో రూ.24,113 కోట్లకు ఎగబాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడంతో పాటు కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. ఈ క్యూ1లో బ్యాంకు స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.21,121.22 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి నమోదైన స్టాండ్‌ఎలోన్‌ ప్రాఫిట్‌ రూ.19,160.44 కోట్లతో పోలిస్తే 10.23 శాతం వృద్ధి కనబరిచింది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఈ జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన దాదాపు 15 శాతం వృద్ధితో రూ.46,992 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలానికి బ్యాంకు స్థూల రుణాలు 18.63 శాతం పెరగడం ఇందుకు తోడ్పడింది. కాగా, ఈ క్యూ1లో బ్యాంక్‌ దేశీయ వ్యాపార నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) వార్షిక ప్రాతిపదికన పోలిస్తే స్వల్పంగా తగ్గి 3 శాతానికి పరిమితమైంది. కానీ, ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఎన్‌ఐఎం 0.07 శాతం పెరిగింది.

  • గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ వడ్డీయేతర ఆదాయం మాత్రం 9 శాతం తగ్గి రూ.15,293 కోట్లకు జారుకుంది. ఫారెక్స్‌ లేదా డెరివేటివ్‌ ఆదాయం 70 శాతం మేర తగ్గడం ఇందుకు ప్రధాన కారణం.

  • ఈ క్యూ1లో ఎస్‌బీఐ డిపాజిట్లు 9.73 శాతం వృద్ధి చెందాయి. మొత్తం డిపాజిట్లలో కరెంట్‌, సేవింగ్‌ అకౌంట్ల (కాసా) వాటా 0.12 శాతం తగ్గి 39.36 శాతానికి పరిమితమైంది.


  • గడిచిన మూడు నెలల్లో రూ.7,046 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి కొత్తగా మొండి బకాయి లుగా మారిన రూ.7,945 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గినప్పటికీ, ఈ మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.5,521 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి.

  • బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. గత ఏడాది జూన్‌ 30 నాటికి 1.83 శాతంగా నమోదైన బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ).. ఈ జూన్‌ చివరికల్లా 1.47 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.38 శాతానికి జారుకున్నాయి. గడిచిన రెండు దశాబ్దాలకు పైగా కాలంలో బ్యాంక్‌కు ఇదే అత్యల్ప ఎన్‌పీఏ నిష్పత్తి అని ఎస్‌బీఐ వెల్లడించింది.

  • ఈ క్యూ1లో బ్యాంక్‌ మొండి బకాయిల నష్టాన్ని పూడ్చుకునేందుకు రూ.3,359 కోట్లు కేటాయించింది. గత ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో జరిపిన రూ.4,934 కోట్ల కేటాయింపులతో పోలిస్తే చాలా తక్కువ ఇది. ఈ మార్చి త్రైమాసికం కేటాయింపులు రూ.3,140 కోట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే.

  • ఈ జూన్‌ 30 నాటికి ఎస్‌బీఐ మూలధన సమృద్ధి నిష్పత్తి (క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో) 15.67 శాతంగా నమోదైంది.

  • ఆశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్‌బీఐ షేరు ధర శుక్రవారం 1.03 శాతం పెరిగి రూ.1,096.05 వద్ద ముగిసింది.


  • 14-15 శాతం రుణ వృద్ధి లక్ష్యం

  • సీఎస్‌ శెట్టి

ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 14-15 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. 10-11 శాతం డిపాజిట్ల పెరుగుదల ఈ రుణ వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు తోడ్పడగలదన్నారు. ఆర్‌బీఐ ఇటీవల ప్రవేశపెట్టిన ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (బ్యాంక్‌) డిపాజిట్‌ విండో ద్వారా తమ బ్యాంక్‌ ఇప్పటికే 600 కోట్ల డాలర్ల డిపాజిట్లు సమీకరించిందని వెల్లడించారు. సెప్టెంబరు 30తో ముగియనున్న ఈ పథకం ద్వారా బ్యాంక్‌ మొత్తం డిపాజిట్ల సేకరణ 1,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని శెట్టి అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఫారెక్స్‌ నిల్వలను పెంచుకునేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది.

Updated Date - Aug 08 , 2026 | 12:54 AM