వినోద్ అదానీకి ఊరట
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:35 AM
అమెరికన్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించిన కేసుల నుంచి అదానీ గ్రూప్ క్రమంగా బయటపడుతోంది. తాజాగా గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీకీ ఊరట లభించింది.
ఆయనపై వచ్చిన ఆరోపణలపై
ఆధారాలు లభించలేదన్న సెబీ
ముంబై: అమెరికన్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించిన కేసుల నుంచి అదానీ గ్రూప్ క్రమంగా బయటపడుతోంది. తాజాగా గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీకీ ఊరట లభించింది. నాలుగు లిస్టెడ్ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రెండు ఆఫ్‌షోర్ ఫండ్లను వినోద్ అదానీయే నియంత్రించారని, తద్వారా ఆ కంపెనీల 25ు కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని సెబీ వెల్లడించింది. అలాగే, వినోద్ అదానీతో పాటు మరో 11 మందిపై వచ్చిన మోసం ఆరోపణలకూ ఎలాంటి సాక్ష్యాల్లేవని 81 పేజీల తుది ఆర్డరు కాపీలో సెబీ పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (గతంలో అదానీ ట్రాన్స్‌మిషన్)లో ఎమర్జింగ్ ఇండి యా ఫోకస్ ఫండ్ (ఈఐఎఫ్ఎఫ్), ఈఎం రిసర్జెంట్ ఫండ్ (ఈఎంఆర్) అనే రెండు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వె్‌స్టమెంట్ (ఎఫ్‌పీఐ) ఫండ్లు వినోద్ అదానీ ఆదేశాల మేరకే పెట్టుబడులు పెట్టాయని, తద్వారా ప్రమోటర్లు ఎంపీఎస్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే, అదానీ పవర్‌లో ఓపల్ ఇన్వె్‌స్టమెంట్స్ పెట్టుబడులను కూడా వినోద్ అదానీయే నియంత్రించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, తమ దర్యాప్తులో ఈ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని సెబీ పూర్తికాల సభ్యుడు కమలేశ్ చంద్ర ఆర్డరు కాపీలో పేర్కొన్నారు.