2030 నాటికి రీట్స్, ఇన్విట్స్‌లోకి రూ.11.6 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:16 AM
దేశంలో ఇన్విట్స్‌తోపాటు రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్) ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, భవిష్యత్‌లో భారీగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని...
అవెండస్ క్యాపిటల్ అంచనా
న్యూఢిల్లీ: దేశంలో ఇన్విట్స్‌తోపాటు రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్) ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, భవిష్యత్‌లో భారీగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని అవెండస్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది. 2030 నాటికి రీట్స్, ఇన్విట్స్ రూ.11.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు వంటి సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిల్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయని అవెండస్ క్యాపిటల్ అంటోంది. అంతేకాదు, లిస్టెడ్ రీట్స్, ఇన్విట్స్‌లోకి హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా భారీగా పెరగనున్నాయని అంటోంది.
ఇన్విట్స్ యూనిట్ హోల్డర్లకు రూ.22,800 కోట్లు: గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) తమ యూనిట్ హోల్డర్లకు దాదాపు రూ.22,800 కోట్లు పంపిణీ చేశాయి. దాంతో ఇన్విట్స్ ఇప్పటివరకు యూనిట్ హోల్డర్లకు పంచిన మొత్తం సొమ్ము విలువ రూ.91,000 కోట్లకు చేరుకుంది. భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ (బీఐఏ) మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 26 ఇన్విట్స్ ఉండగా.. అందులో 8 స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఐఏ డేటా ప్రకారం.. ఇన్విట్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.3 లక్షల కోట్లుగా ఉండగా.. 2025-26లో రూ.7.1 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్విట్స్ యూనిట్ హోల్డర్లు దాదాపు 2 లక్షల మేర పెరిగారు. లిస్టెడ్ ఇన్విట్స్ యూనిట్ హోల్డర్లు 64 శాతం వృద్ధి చెందారు. కాగా, 2025-26లో ఇన్విట్స్ ఈక్విటీ జారీ ద్వారా రూ.1.97 లక్షల కోట్లు సమీకరించాయి. 2024-25లో నిధుల సమీకరణ రూ.1.75 లక్షల కోట్లుగా నమోదైంది. 2026 మార్చి 31 నాటికి ఇండస్ట్రీ స్థూల రుణ భారం రూ.3.35 లక్షల కోట్లుగా ఉందని బీఐఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..