బయటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనే స్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ
ABN , Publish Date - May 29 , 2026 | 02:49 PM
అంతర్జాతీయ అనిశ్చితులతో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక రంగ మూలాలు దృఢంగా ఉన్నాయని ఆర్‌బీఐ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులతో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయని ఆర్‌బీఐ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది దేశం అభివృద్ది పథంలో పయనిస్తుందని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం భారత రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని వివరాల ప్రకారం, కార్పొరేట్ రంగం, బ్యాకింగ్ రంగం లాభాల్లో ఉండటంతో పాటు మౌలిక వసతుల కల్పనకు భారత్ పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో ఈసారి అభివృద్ధికి ఢోకా ఉండదు. అయితే, ఈ ఏడాది ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ అనిశ్చితులు కొంత ప్రతిబంధకంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి, ద్రవ్యోల్బణంపై పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రభావం చూపించనున్నాయి. ఫలితంగా ఆర్థిక అభివృద్ధి ఓ మోస్తరు స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
అయితే, భారత్ పురోగతి సానుకూలంగానే ఉండనుంది. వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు కూడా ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా మారనున్నాయి. ఇక ఎల్ నినో ప్రభావంతో ఈసారి భారత్‌లో వ్యవసాయ ఉత్పాదకత తగ్గే అవకాశం ఉందని కూడా ఆర్‌బీఐ తన నివేదికలో అంచనా వేసింది. ఈ వానాకాలం మలిదశలో హిందూ మహాసముద్రంలో పరిస్థితులు కొంత అనుకూలించి ఎల్ నినో ప్రభావం కొంత తగ్గవచ్చని కూడా ఆర్‌బీఐ అంచనా వేసింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఎరువులు, ఇతర ముడి సరకుల ధరలపై ఒత్తిడి ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఎరువుల కొరత లేకుండా పలుమార్గాల్లో భారత్ వాటిని సమకూర్చుకుంటున్నందున ఇక్కట్లు తక్కువగా ఉండొచ్చని పేర్కొంది. దేశంలో తగినంత ధాన్యం నిల్వలు, రిజర్వాయర్లల్లో నీటి నిల్వలు ఉండటంతో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం కొంత తగ్గి ఈ ఏడాది ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2026-31 మధ్య కాలానికి ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీబీటీ పథకాలు, డొమెస్టిక్ రిటైల్ విభాగంలో డిజిటల్ కరెన్సీని మరింత విస్తరించే యోచనలో తాము ఉన్నట్టు కూడా ఆర్‌బీఐ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు