Share News

ఇక వారం వారం క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌

ABN , Publish Date - May 24 , 2026 | 03:33 AM

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై తీసుకున్న రిటైల్‌ రుణాలను ఇక ఎలాంటి పెనాల్టీలు, చార్జీలు లేకుండా ముందుగానే చెల్లించవచ్చు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మంజూరైన లేదా రెన్యువల్‌ చేసిన గృహ....

ఇక వారం వారం క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌

  • నలుగురి వరకు నామినీలు

  • మారుతున్న రుణ నిబంధనలు

రుణాల మంజూరు, క్రెడిట్‌ స్కోరు, నామినేషన్లకు సంబంధించి పలు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ‘ఏప్రిల్‌ 1 రీసెట్‌’ పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్పుల్లో కొన్ని గత ఏడాది నవంబరు నుంచి అమల్లోకి రాగా మరికొన్ని ఈ ఏడాది జూలై మధ్య నుంచి అమల్లోకి రానున్నాయి.

రుణ చెల్లింపుల్లో మార్పులు: ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై తీసుకున్న రిటైల్‌ రుణాలను ఇక ఎలాంటి పెనాల్టీలు, చార్జీలు లేకుండా ముందుగానే చెల్లించవచ్చు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మంజూరైన లేదా రెన్యువల్‌ చేసిన గృహ, వ్యక్తిగత, విద్య, కార్ల రుణాలకు ఇది వర్తిస్తుంది. చేతిలో డబ్బులున్నా ముందుగా చెల్లిద్దామంటే ఫోర్‌ క్లోజర్‌ చార్జీల పేరుతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పటి వరకు రుణ గ్రహీతలను నిరాశ పరిచేవి. ఈ మార్పుతో ఈ ఫోర్‌క్లోజర్‌ చార్జీలకు పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ సౌలభ్యంతో రుణ గ్రహీతలు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే తమ రుణాలు ముందుగానే చెల్లించి వడ్డీల భారం తగ్గించుకునే అవకాశం ఏర్పడింది. ఇది రుణగ్రహీతల ప్రవర్తనను కూడా మార్చివేస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల ఏర్పడే సౌలభ్యాలేమిటంటే..

  • మిగులు నిధులు ఉన్నప్పుడు అప్పులు త్వరగా తీర్చేసే అవకాశం

  • వడ్డీ చెల్లింపుల భారం తగ్గించుకునే సౌలభ్యం

  • బోన్‌సలు, ఆకస్మిక లాభాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం

క్రెడిట్‌ స్కోరు మార్పులు

ప్రస్తుతం క్రెడిట్‌ డేటా రిపోర్టింగ్‌, క్రెడిట్‌ స్కోరు అప్‌డేషన్స్‌ నెలకు ఒకసారి జరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ రెండు విషయాలు వారానికి ఒకసారి అప్‌డేట్‌ అవుతాయి.

రీపేమెంట్ల ప్రభావం క్రెడిట్‌ స్కోరుపై త్వరగా ప్రతిఫలిస్తుంది.

  • రుణ చెల్లింపులు ఆలస్యమైనా, చెల్లించలేకపోయినా ఆ ప్రభావం కూడా త్వరగా క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది.

  • రుణ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించే వారి క్రెడిట్‌ స్కోరు మరింత త్వరగా మెరుగుపడుతుంది

నష్టాలున్నాయ్‌..: క్రెడిట్‌ స్కోర్‌ మార్పులతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే?

  • ఒక ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైనా, అది వారం రోజుల్లోనే ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తుంది.

  • ఈ చిన్న చెల్లింపు సమస్య నుంచి బయటపడేందుకు రుణ గ్రహీతలకు పెద్దగా సమయం కూడా ఉండదు.

  • ఈఎంఐల చెల్లింపుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం వెంటనే ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోరుపై పడుతుంది.


నామినీలు

గత ఏడాది నవంబరు 1 నుంచి బ్యాంకు ఖాతాలు, లాకర్ల నామినీలకు సంబంధించి కూడా కొన్ని మార్పులను ఆర్‌బీఐ ప్రకటించింది.

మార్పులు ఏమిటంటే..

  • ఖాతాదారులు ఇక తమ ఫిక్స్‌డ్‌ డిపా జిట్లు (ఎఫ్‌డీలు), లాకర్లకు నలుగురు నామినీలను నామినేట్‌ చేయవచ్చు.

  • ఇది ఒకేసారి లేదా విడతలుగానూ చేయవచ్చు

  • దీనివల్ల ఖాతాదారుడు చనిపోతే ఆస్తుల బదిలీ ప్రక్రియ సులభమవుతుంది.

  • ఎఫ్‌డీలు, లాకర్లలోని వస్తువులను ఎలాంటి వివాదాలు, ఆలస్యం లేకుండా ఖాతాదారుడి అభిమతం ప్రకారం నామినీలకు బదిలీ చేయవచ్చు.

నగర వ్యాపారులకు ఊరట

నగల వ్యాపారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని హామీగా చూపి తీసుకునే రుణాలను గతంలో 180 రోజుల్లో చెల్లించాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్‌బీఐ ఈ కాలపరిమితిని 270 రోజులకు పెంచింది. దీనివల్ల నగల వ్యాపారులకు మేలు జరగనుంది. దీనిద్వారా మెరుగైన నగదు నిర్వహణతో పాటు రీఫైనాన్స్‌ ఒత్తిడి తగ్గటం సహా మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.

ఇతర ప్రయోజనాలు

  • మంచి పరపతి స్కోరు ఉన్న రుణ గ్రహీతలు, తక్కువ వడ్డీ రేట్ల కోసం బేరమాడే శక్తి

  • బ్యాంకులు కూడా మంచి పరపతి స్కోరు ఉన్న రుణ గ్రహీతలను ఎంచుకునే అవకాశం

  • పరపతి స్కోరు తగ్గిపోయే రుణగ్రహీతల విషయంలో ముందు జాగ్రత్త పడే అవకాశం

Updated Date - May 24 , 2026 | 03:33 AM