ఈసారి వడ్డీ రేట్లు యథాతథం!
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:19 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక రెపో రేటుపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై...
బుధవారం నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక రెపో రేటుపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ నిపుణులు మాత్రం రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచి, జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మాత్రం కుదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్, క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ దీప్తి దేశ్‌పాండే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈక్విరస్ క్యాపిటల్ (ఫిక్స్‌డ్ ఇన్‌కమ్) విభాగం ఎండీ వినయ్ పాయ్ మాత్రం బ్యారల్ చమురు ధర 100 డాలర్ల పైన కొనసాగితే ఆగస్టులో జరిగే భేటీలో ఎంపీసీ కీలక రెపో రేటు 0.5 శాతం పెంచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం వెలువడే సమీక్షలో మాత్రం రెపో రేటు యథాతథంగా ఉంచి, జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కుదించి, రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం (జూన్ 3) ఎంపీసీ భేటీ కానుంది. శుక్రవారం (5 వ తేదీ) సమీక్షా సమావేశం వివరాలను మల్హోత్రా వెల్లడించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన
యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి