దేశంలో వడ్డీ రేట్లు మరింత పైకే!
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:29 AM
దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ కూడా తన నివేదికలో ఇదే విషయం స్పష్టం చేసింది. డిసెంబరు 2-4 తేదీల మధ్య జరిగే భేటీలో...
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ వెల్లడి
ఫిబ్రవరి నాటికి రెపోరేటు 6 శాతం
డాలర్ తో రూపాయి మారకానికీ తిప్పలు
ముంబై: దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ కూడా తన నివేదికలో ఇదే విషయం స్పష్టం చేసింది. డిసెంబరు 2-4 తేదీల మధ్య జరిగే భేటీలో పావు శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే భేటీలో మరో పావు శాతం చొప్పున భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక రెపోరేటు పెంచే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 5.5 శాతంగా ఉన్న రెపో రేటు ఫిబ్రవరి నాటికి 6 శాతానికి చేరనుంది. అప్పటి పరిస్థితులను బట్టి 2027 ఏప్రిల్‌లో జరిగే భేటీలోనూ ఎంపీసీ.. రెపో రేటు మరో పావు శాతం పెంచే అవకాశం లేకపోలేదని అంచనా వేసింది. ఆర్‌బీఐ రెపో రేటు ఆధారంగానే బ్యాంకు లు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
రూపాయి పరిస్థితి ఇంతే..
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు ఊపందుకున్నా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు పెద్దగా పుంజుకునే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఫార్వర్డ్ ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ నెట్ డాలర్ షార్ట్ పొజిషన్ 23,900 కోట్ల డాలర్ల వరకు ఉండడం ఇందుకు పెద్ద అడ్డంకి కానుందని తెలిపింది. దీంతో గత ఏడాది అక్టోబరులో 10 నెలల దిగుమతులకు సరిపడా ఉన్న దేశ ఫారెక్స్ నిల్వలు, ఈ ఏడాది గత నెలాఖరు నాటికి ఏడు నెలలకు పడిపోయినట్టు పేర్కొంది. 23,900 కోట్ల డాలర్ల నెట్ షార్ట్ పొజిషన్ కారణంగా రానున్న సంవత్సరాల్లో దేశంలోకి వచ్చిన డాలర్లను వచ్చినట్టు ఆర్‌బీఐ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అలా అని డాలర్ తో రూపాయి మారకం రేటు పెద్దగా కుంగిపోయే ప్రమాదమూ లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్య కాలంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.92-96 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తగ్గనున్న చమురు సెగ
భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ చమురు సగటు ధర మరింత తగ్గనుందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో సగటున 102 డాలర్ల వరకు ఉన్న ఈ ధర.. వచ్చే ఐదు నెలల్లో 85 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ కుదిరితే ముడి చమురు ధర మరింత భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు