పొద్దుపోయాక ఫోన్ చేసి వేధించొద్దు.. రుణాల వసూళ్లపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:16 PM
రుణాల వసూళ్లకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణగ్రహీతలకు రికవరీ ఏజెంట్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
రుణాల వసూళ్లకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రుణగ్రహీతలకు రికవరీ ఏజెంట్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రికవరీ ఏజెంట్లు, బ్యాంకుల నియమావళికి సంబంధించి పటిష్ఠ నిబంధనలను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచీ ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. లోన్ రికవరీ బాధ్యతను ఇతర సంస్థలకు ఔట్‌సోర్సింగ్ చేసిన సందర్భాల్లో రికవరీ ఏజెంట్ల బాధ్యత రుణదాతలదేనని స్పష్టం చేసింది.
కొత్త మార్గదర్శకాలు ఇవీ..
లోన్ రికవరీ కోసం ఉదయం 8 నుంచి రాత్రి 7 లోపు మాత్రమే రుణగ్రహీతలకు ఏజెంట్స్, బ్యాంకులు ఫోన్ చేయాలి. రుణగ్రహీతల అనుమతి తీసుకున్నాకే నిర్ణీత వేళలను దాటి కాల్ చేయాలి. మెడికల్ ఎమర్జెన్సీలు, వ్యక్తిగతంగా సున్నితమైన సందర్భాల్లో రుణగ్రహీతలను సంప్రదించకూడదు. రుణగ్రహీతలను బెదిరించడం, దుర్భాషలాడటం చేయకూడదు. బహిరంగంగా పరువు తీసే చర్యలకు దిగకూడదు.
సోషల్ మీడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట
లోన్ రికవరీ కోసం యూజర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను దుర్వినియోగపరచకూడదు. యూజర్ల పరువు తీసేలా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగులను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు. లోన్ రికవరీ కోసం తొలిసారి రుణగ్రహీత ఇంటికి వెళ్లేందుకు కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలి. రికవరీ ఏజెంట్ వివరాలను బ్యాంకులు ముందుగానే రుణగ్రహీతకు అందించాలి. రుణగ్రహీతలు సూచించిన ప్రదేశంలో వారిని కలిసేందుకు వీలైనంత వరకూ ప్రయత్నించాలి. ప్రత్యేక ప్రదేశాన్ని రుణగ్రహీత నిర్దేశించకపోయినా లేదా చెప్పిన చోటుకు వస్తానని చెప్పి పలుమార్లు మాటతప్పినా నేరుగా ఇంటికి వెళ్లొచ్చు.
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది బాధ్యత కూడా రుణదాతలదే
రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో పాటు లోన్ రికవరీకి అనుమతించే ఆథోరైజేషన్ లెటర్, ఇతర నోటీసులు వెంట తీసుకెళ్లాలి. ఈ లేఖలో బ్యాంకు గ్రీవెన్స్ అధికారి కాంటాక్ట్ నంబర్ కూడా ఉండాలి. లోన్ రికవరీ కోసం ఏజెంట్స్ చేసే కాల్ రికార్డులను బ్యాంకులు భద్ర పరచాలి. కనీసం ఆరు నెలల పాటు వీటిని పెట్టుకోవాలి. లోన్ రికవరీకి ఔట్‌సోర్సింగ్ సంస్థలను నియమించుకున్న సందర్భాల్లో కూడా ఆయా రికవరీ ఏజెంట్ల చర్యలకు రుణదాతలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రికవరీ ఏజెంట్లు నిబంధనలను అమలు చేసేలా బ్యాంకులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇందుకు సంబంధించి రుణదాత సంస్థలు రికవరీ ఏజెంట్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వాలి.
రుణగ్రహీతలకు సమయం ఇచ్చాకే చర్యలు..
లోన్ రికవరీకి అవససరమైన రుణగ్రహీతల సమాచారాన్ని మాత్రమే ఏజెంట్లు తీసుకునే వీలుండేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిని ప్రత్యేక లోన్స్‌తో కొన్న సందర్భాల్లో మాత్రమే వాటిని రిమోట్‌గా లాక్ చేసే అధికారం రుణదాతలకు ఉంటుంది. వ్యక్తిగత రుణంతో చేసే కొనుగోళ్లకు ఇది వర్తించదు. ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా సంస్థలు లబ్ధిదారులకు కొంత సమయం ఇవ్వాలి. రిమోట్ లాకింగ్ సందర్భాల్లో కూడా అత్యవసర సేవలైన ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఇక ఈఎంఐ చెల్లింపులు లేదా లోన్ సెటిల్మెంట్ జరిగిన గంట లోపే డివైజ్‌ను యాక్టివేట్ చేయాలి. ఉపకరణాల కొనుగోలుకు సంబంధించిన లోన్స్ తీసుకున్నప్పుడు రిమోట్ ఆంక్షల గురించి ముందుగానే రుణగ్రహీతలకు తెలియజేయాలి.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో రోజూ పెరిగిన గోల్డ్ రేట్స్
కేకేఆర్ చేతికి మెడికవర్ హాస్పిటల్స్