దేశ ఆర్థిక స్థిరత్వానికే మా ఓటు
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:29 AM
దేశ,విదేశీ ఆటుపోట్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ముప్పుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని...
ఆటుపోట్లపై పారాహుషార్
తగ్గుతున్న పసిడి దిగుమతులు
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
మన బ్యాంకులు మహా స్ట్రాంగ్
దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో మొండి బకాయిలు
ముంబై: దేశ,విదేశీ ఆటుపోట్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ముప్పుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడం గతంలో కంటే ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన ‘అర్థ సంవత్సర ఆర్థిక స్థిరత్వ నివేదిక’ (ఎఫ్‌ఎ్‌సఆర్) ముందు మాటలో తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న భారీ అంతర్జాతీయ ఆటుపోట్లను మన ఆర్థిక వ్యవస్థ సమర్ధవంతంగా తట్టుకున్నా, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇందుకు అవసరమైన రక్షణ చర్యలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. బలమైన వృద్ధి రేటు, తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, కంపెనీల పటిష్ఠమైన ఆస్తి-అప్పుల పట్టికలు (బ్యాలెన్స్ షీట్స్), పుష్కలంగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు.. మన స్థూల ఆర్థిక పునాదులు దెబ్బతినకుండా కాపాడాయని మల్హోత్రా తన ముందు మాటలో పేర్కొన్నారు.
బలంగా బ్యాంకులు
మూలధనం, ద్రవ్య చలామణి, లాభాలు, మొండి బకాయిలు, పరపతి వృద్ధి రేటుపరంగా చూస్తే మన దేశ బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎ్‌ఫసీ) ఆర్థిక పునాదులు ఇప్పటికీ అత్యంత పటిష్ఠంగానే ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు. ఆకస్మికంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా, మన బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఈ బలమే మన ఆర్థిక వ్యవస్థకు, వృద్ధి రేటుకు పెద్ద ఆలంబన అన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సాంకేతిక ఆటంకాలు, ఏఐ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థలను పూర్తిగా మార్చివేస్తున్నాయన్నారు.
చమురు ధరే పెద్ద సమస్య
ముడి చమురు ధర పెరుగుదలే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న పెద్ద ముప్పు అని ఎఫ్‌ఎ్‌సఆర్ నివేదిక పేర్కొంది. దీనివల్ల డాలర్‌తో రూపాయి మారకం రేటు కూడా ప్రభావితం అవుతుందని హెచ్చరించింది. అయితే పుష్కలంగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ విషయంలో భారత్‌కు శ్రీరామ రక్షగా నిలుస్తాయని తెలిపింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి కుదిరి, చమురు సెగ తగ్గితే అది భారత ఆర్థిక వ్యవస్థకీ మేలు చేస్తుందని తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లలో ఏఐ కంపెనీల షేర్లు కుప్పకూలితే, ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పైనా తప్పక ఉంటుందని ఆర్‌బీఐ నివేదిక అంచనా వేసింది.
పసిడి దిగుమతులు డౌన్
పసిడి వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఫలిస్తోందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మే నెల పసిడి దిగుమతులు 1,200 కోట్ల డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది బాగా తక్కువని తెలిపింది. పసిడి దిగుమతులు తగ్గడం వరుసగా ఇది మూడో నెల అని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన దేశ వాణిజ్య లోటులో సగం వాటా ముడి చమురు, బంగారానిదే. గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులూ తగ్గుముఖం పట్టినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఈ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడులు 190 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఈ పథకాల్లోకి రూ.24,039 కోట్ల పెట్టుబడులు వస్తే, మే నెలలో రూ.725 కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయినట్టు ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది.
కుటుంబాల నెత్తిన అప్పుల కుప్ప
దేశంలో కుటుంబాల నెత్తిన అప్పుల కుప్ప పెరిగిపోవడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ అప్పులు దేశ జీడీపీలో 45.5 శాతానికి చేరాయని తెలిపింది. గృహేతర రిటైల్ రుణాలు పెరిగి పోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం గృహేతర కుటుంబ రుణాల్లో రిటైల్ రుణాల వాటా 58.4 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం గృహ, వ్యవసాయ, వ్యాపార రుణాలతో పోలిస్తే గృహేతర రిటైల్ రుణాల వాటానే ఎక్కువని పేర్కొంది.
ఎన్‌పీఏలు
దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల వాటా ప్రస్తుతం అనేక దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరిందని ఎఫ్‌ఎ్‌సఆర్ తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిల (ఎన్‌పీఏ) వాటా 1.8 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మాత్రం ఈ బకాయిల వాటా 1.9 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అయినా బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక పునాదులకు ఎలాంటి నష్టం లేదని పేర్కొంది. అయితే పొదుపరులు తమ పొదుపు మొత్తాలను అధిక రాబడుల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మళ్లిస్తున్నందున బ్యాంకులకు నిధుల సమీకరణ సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..