Share News

రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌

ABN , Publish Date - May 23 , 2026 | 05:54 AM

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ బొనాంజా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌...

రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి ఆర్‌బీఐ బంపర్‌ బొనాంజా

  • 2024-25తో పోలిస్తే 6.7 శాతం అధికం

  • పశ్చిమాసియా సంక్షోభ సమయంలో మోదీ సర్కారుకు ఆర్థిక ఊరట

ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ బొనాంజా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్‌ చెల్లించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌తో పోలిస్తే 6.7 శాతం అధికం ఇది. అంతేకాదు, రూ.2 లక్షల కోట్లకు పైగా డివిడెండ్‌ చెల్లించడం ఇది వరుసగా మూడోసారి. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా దిగుమతుల వ్యయ భారం, సరఫరా అవాంతరాలతో దేశం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి.

ఎందుకంటే, ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం ఫలితంగా హోర్ముజ్‌ జలసంధి ద్వారా సరుకు రవాణా స్తంభించిపోయింది. దాంతో ముడి చమురు, సహజ వాయువు, ఎరువులతో పాటు కీలక కమోడిటీల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి కూడా బాగా క్షీణించడంతో ప్రభుత్వంపై దిగుమతుల వ్యయ భారం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఆల్‌టైం గరిష్ఠ స్థాయి డివిడెండు ప్రకటించినప్పటికీ, మోదీ సర్కారుకు లభించనున్న ఊరట మాత్రం కొంతేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఆర్‌బీఐ నుంచే 91 శాతం..

ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్‌ల రూపంలో లభించనున్న పన్నేతర ఆదాయం రూ.3.16 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చని ఈసారి బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది. కేవలం ఆర్‌బీఐ డివిడెండ్‌ ద్వారానే బడ్జెట్‌ అంచనాలో 91 శాతం సమకూరబోతోంది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.98 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఈసారి పన్నేతర ఆదాయం బడ్జెట్‌ అంచనాలను మించవచ్చని విశ్లేషకులు అన్నారు.

సెంట్రల్‌ బోర్డు సభ్యుల 623వ సమావేశం

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డు సభ్యుల 623వ సమావేశం శుక్రవారం జరిగింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు జే స్వామినాథన్‌, పూనమ్‌ గుప్తా, శిరీష్‌ చంద్ర ముర్ము, రోహిత్‌ జైన్‌తోపాటు సెంట్రల్‌ బోర్డులోని ఇతర సభ్యులైన నాగరాజు మద్దిరాల (ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి), సతీశ్‌ కాశీనాథ్‌ మరాఠే, రేవతి అయ్యర్‌, సచిన్‌ చతుర్వేది, ఆనంద్‌ మహీంద్రా, వేణు శ్రీనివాసన్‌, పంకజ్‌ రామన్‌భాయ్‌ పటేల్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, పొంచి ఉన్న ముప్పులపై సమీక్ష జరపడంతో పాటు కేంద్రానికి చెల్లించాల్సిన డివిడెండ్‌పైనా నిర్ణయం తీసుకున్నారు.


రూ.91.97 లక్షల కోట్లకు

ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌

  • 2026 మార్చి 31 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ సైజు వార్షిక ప్రాతిపదికన 20.61 శాతం పెరిగి రూ.91,97,121.08 కోట్లకు పెరిగింది. అలాగే, నికర ఆదాయం (రిస్క్‌ ప్రొవిజన్‌, మిగులు నిధుల బదిలీకి ముందు) రూ.3.96 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా నమోదైంది.

  • పరిస్థితులను బట్టి బ్యాలెన్స్‌ షీట్‌ సైజులో 4.5-7.5 శాతం మేర నిధులను తక్షణ రిస్క్‌ బఫర్‌ (సీఆర్‌బీ) రూపంలో నిర్వహించేందుకు సవరించిన ఎకనామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఈసీఎఫ్‌) వెసులుబాటు కల్పిస్తుందని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.

  • ప్రస్తుత దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు, రిజర్వ్‌ బ్యాంక్‌ పనితీరును పరిగణనలోకి తీసుకున్నాక ఈ ఆర్థిక సంవత్సరం రిస్క్‌ బఫర్‌ని బ్యాలెన్స్‌ షీట్‌లో 6.5 శాతంగా నిర్వహించాలని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం నికర ఆదాయం లో రూ.1,09,379.64 కోట్లను సీఆర్‌బీకి బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. 2024-25లో రిస్క్‌ బఫర్‌లోకి రూ.44,861.70 కోట్లు బదిలీ చేసింది. 2024-25లో సీఆర్‌బీ బ్యాలెన్స్‌ షీట్‌లో 7.5 శాతంగా ఉంది.

  • నికర ఆదాయం నుంచి రిస్క్‌ బఫర్‌లోకి బదిలీ చేయగా మిగిలిన రూ.2,86,588.46 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో చెల్లించేందుకు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

కేంద్రానికి ఆర్‌బీఐ డివిడెండ్‌

ఆర్థిక సంవత్సరం రూ.లక్షల కోట్లు

2025-26 2.87

2024-25 2.69

2023-24 2.1

2022-23 87,416 కోట్లు

ఇవి కూడా చదవండి:

బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్

Updated Date - May 23 , 2026 | 05:54 AM