Share News

ఆర్‌బీఐ భారీగా బంగారాన్ని విక్రయించినట్టు వార్త.. ఖండించిన కేంద్రం

ABN , Publish Date - Jun 03 , 2026 | 02:53 PM

ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు ఆర్‌బీఐ బంగారాన్ని మార్కెట్‌లో విక్రయించిందన్న అంతర్జాతీయ మీడియా వార్తలను కేంద్రం తాజాగా కొట్టిపారేసింది.

ఆర్‌బీఐ భారీగా బంగారాన్ని విక్రయించినట్టు వార్త.. ఖండించిన కేంద్రం
Center Debunks News of RBI Selling Gold for forex Reserves

ఇంటర్నెట్ డెస్క్: ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో భారీగా బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించిందంటూ ప్రముఖ బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని కేంద్రం తాజాగా ఖండించింది. వాస్తవానికి ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా పెరిగిందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి 31 నాటికి బంగారం వాటా 13.92 శాతం నుంచి 16.70 శాతానికి పెరిగిందని చెప్పింది. అంతేకాకుండా, మే 22 నాటికి ఈ వాటా మరింత పెరిగి 16.85 శాతానికి చేరుకుందని పేర్కొంది. బంగారం నిల్వల గురించి ప్రతి నెలా నివేదికను విడుదల చేస్తామని కూడా కేంద్రం పేర్కొంది. ఇందుకు సంబంధించి అధీకృత సమాచారం కోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.


మే 22తో ముగిసిన పక్షం రోజుల్లో 12 బిలియన్ డాలర్‌ల విలువైన బంగారాన్ని ఆర్‌బీఐ విక్రయించినట్టు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ సమయంలో 7.5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను సమకూర్చుకున్నట్టు చెప్పింది. ఈ కథనంపై ఆర్‌బీఐ కూడా స్పందించింది. వీటిల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

భారత్‌ వద్ద ఉన్న ఫారిన్ ఎక్స్‌జెంట్ నిల్వల్లో డాలర్ వంటి విదేశీ కరెన్సీలతో పాటు బంగారం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎమ్ఎఫ్ రిజర్వ్ పొజిషన్స్ వంటివి ఉంటాయి. అయితే, ఈ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా క్రమంగా పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఇక అంతర్జాతీయంగా కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఫారెక్స్ నిల్వలకు సంబంధించి వివిధ రకాల అసెట్స్‌పై (ఆస్తులు) పెట్టుబడులు పెడుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు.. మరో ప్రయోగానికి మారుతీ సంస్థ సిద్ధం

Updated Date - Jun 03 , 2026 | 03:06 PM